Swiggy Instamart: హస్తినాపురంలోని జెడ్పీ రోడ్లో ఉన్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ బాగోతం ఎట్టకేలకు బట్టబయలైంది. డెలివరీ రైడర్లు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య మొదలైన గొడవ.. ఆ మార్ట్‌లో జరుగుతున్న కాలం చెల్లిన నిత్యవసర వస్తువుల విక్రయాల దందాను బయటపెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా అపరిశుభ్ర వాతావరణంలో ఎక్స్పైరీ డేట్ ముగిసిన ఆహార పదార్థాలను యథేచ్ఛగా విక్రయిస్తున్న ఈ ఇన్‌స్టామార్ట్ తీరు తీవ్ర కలకలం రేపింది. రైడర్లు చేపట్టిన మూడు రోజుల నిరంతర పోరాటంతో చివరికి ఆ మార్ట్‌ను మూసివేయక తప్పలేదు.
ఒకవైపు డెలివరీ రైడర్లను పురుగుల్లా చూస్తూ, వారి కనీస అవసరాలను పట్టించుకోకుండా తీవ్ర వేధింపులకు గురిచేస్తోంది ఈ యాజమాన్యం. తమ హక్కుల గురించి ప్రశ్నించిన వారిని విలన్లుగా చిత్రీకరిస్తూ, వారి ఐడీలను అక్రమంగా బ్లాక్ చేస్తున్నారని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకని కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా సెక్యూరిటీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారితీసింది. లోపల జరుగుతున్న ఎక్స్పైరీ వస్తువుల తతంగాన్ని పరిశీలించకుండా, రికార్డు చేయకుండా నిరోధించేందుకు యత్నించారు. చివరికి సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాతే మీడియాను లోపలికి అనుమతించారు.
ఈ అక్రమాలపై ‘అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల కాంగ్రెస్’ నాయకులు క్షేత్రస్థాయిలో నిలబడి పోరాడారు. కార్మికులు, కర్షకుల కాంగ్రెస్ (KKC) రాష్ట్ర జనరల్ సెక్రెటరీ టి. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో జాయింట్ సెక్రటరీ అబ్దుల్ జిలానీ, మున్నా జానీ, రాహుల్ గాంధీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జిల్లా శ్రీనివాస్, యాదగిరి తదితర నాయకులు రైడర్లకు మద్దతుగా నిలిచి ఇన్‌స్టామార్ట్ యాజమాన్యం అక్రమాలను నిలదీశారు.
మరోవైపు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై ఫిర్యాదులు చేసినా, పరిశీలనలో తీవ్ర అలసత్వం వహించిన స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారి సన్నీ తీరుపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్ట్‌లో ఎక్స్పైరీ వస్తువులు అమ్ముతున్నారని స్పష్టంగా ఆధారాలు చూపిస్తున్నా, తాను నగరంలో లేనని చెబుతూ, వారి అక్రమాలకు కొమ్ముకాసేలా కాలయాపన చేశారని రైడర్లు మండిపడుతున్నారు. వినియోగదారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఇన్‌స్టామార్ట్ యాజమాన్యంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
