Telangana: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం నాయకులు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం మానువాడ గ్రామంలో కామ్రేడ్ జోగినిపల్లి ఆనందరావు స్మారక స్తూపానికి సీపీఎం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక పోరాటాన్ని కొందరు స్వార్థ రాజకీయాల కోసం మత ఘర్షణగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. నాటి పోరాటంలో పాల్గొనని వారికి చరిత్ర గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగానే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నాటి నిజాం, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన వీరోచిత పోరాట ప్రాధాన్యతను యువతకు వివరించేందుకు కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు జవాజీ విమల, జిల్లా కమిటీ సభ్యులు మల్లారపు ప్రశాంత్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామంచ అశోక్, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
