పులివెందులలో పవన్ మార్క్ రాజకీయం.. విమర్శలకు తావులేకుండా అభివృద్ధిపైనే దృష్టి!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: రాజకీయాలు అంటే కేవలం ప్రత్యర్థులపై నిత్యం విమర్శలు గుప్పించడమే కాదని, సందర్భాన్ని బట్టి హుందాగా వ్యవహరించడమే నిజమైన నాయకత్వ లక్షణమని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతినిధిగా ఉన్న పులివెందుల నియోజకవర్గ పర్యటనలో ఆయన మాట్లాడిన తీరు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారింది.

ఒక బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి హోదాలో పులివెందుల సభలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన శైలి, మాట్లాడిన విధానం పరిణతి చెందిన రాజకీయాలకు అద్దం పడుతోంది. పర్యటనలో అనవసరమైన వ్యక్తుల ప్రస్తావన గానీ, రాజకీయ వ్యక్తిగత విమర్శలు గానీ చేయకుండా కేవలం అభివృద్ధి, పాలన అంశాలపైనే ఆయన దృష్టి సారించడం విశేషం. సభకు హాజరైన ప్రజాసమూహానికి ఆయన ప్రసంగం ఒక కొత్త అనుభూతిని అందించింది.

రాజకీయ ప్రత్యర్థుల నియోజకవర్గానికి వెళ్లినప్పుడు సాధారణంగా ఎదురయ్యే ఆవేశకావేశాలకు తావులేకుండా, అత్యంత ప్రశాంతంగా, ప్రజా సమస్యలే ప్రాతిపదికగా ప్రసంగించడం నిజమైన లీడర్‌కు ఉండాల్సిన నైజమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం చాలామందికి ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు. కానీ, ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆయన శైలిని దగ్గరగా గమనించే వారికి ఇది ఏమాత్రం వింత కాదనేది స్పష్టమవుతోంది. పులివెందుల వేదికగా పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన ఈ ‘హుందాతో కూడిన రాజకీయం’ కొత్త తరహా రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతోంది.