HYDERABAD: నగరంలో ఉత్తుత్తి డాక్టర్లు!

నగరంలో ఉత్తుత్తి డాక్టర్లు!

కనీస అర్హత లేకుండానే వైద్యం
11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్
జూబ్లీహిల్స్, సికింద్రాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
నకిలీ సర్టిఫికేట్లతో క్లినిక్‌లు నడుపుతున్న ముఠా గుట్టు రట్టు

మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (ఆగస్ట్ 26 ): రాజధాని హైదరాబాద్‌లో డిగ్రీలు లేకుండానే డాక్టర్ల అవతారమెత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పెను ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వైద్యం చేసేందుకు కనీస చదువు, గుర్తింపు పొందిన సర్టిఫికేట్లు లేకపోయినా క్లినిక్‌లు నడుపుతున్న 11 మంది నకిలీ డాక్టర్లను పోలీసులు మంగళవారం కటకటాల్లోకి నెట్టారు.

నగరంలోని జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలు ఒకేసారి దాడులు జరిపి ఈ అక్రమార్కులను పట్టుకున్నాయి. వీరు ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే రోగులకు పవర్ ఫుల్ యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నారు. హైడోస్ ఇంజెక్షన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఇతరుల పేర్లతో తయారు చేసిన నకిలీ డిగ్రీ పత్రాలు, ప్రముఖ హాస్పిటళ్ల పేర్లను వాడుకుని క్లినిక్‌లు తెరిచినట్లు విచారణలో వెల్లడైంది.

దాడుల సమయంలో క్లినిక్‌ల లోపల అనుమతి లేని మందులు, నకిలీ సీళ్లు, పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్హత లేని వైద్యుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. దవాఖానాలకు వెళ్లే ముందు వైద్యుల రిజిస్ట్రేషన్ వివరాలు సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నకిలీ డాక్టర్లకు వెనక ఉండి సర్టిఫికేట్లు సృష్టించిన ప్రధాన సూత్రధారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.