allahabad : హిజాబ్ తప్పనిసరి కాదు!

హిజాబ్ తప్పనిసరి కాదు!

యూనిఫామ్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

నిబంధనలు అమలు చేసే హక్కు పాఠశాల యాజమాన్యానిదే!

మినిట్ 2 మినిట్, ప్రయాగ్‌రాజ్ (ఆగస్ట్ 26 ): విద్యా సంస్థల్లో వస్త్రధారణపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పాఠశాల నిర్దేశించిన యూనిఫామ్‌ను కాదని, హిజాబ్ ధరించడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతంలో తప్పనిసరి భాగం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఏ ప్రైవేట్ లేదా ప్రభుత్వ విద్యా సంస్థ అయినా తన సొంత డ్రెస్ కోడ్ నిబంధనలను అమలు చేసే పూర్తి హక్కు కలిగి ఉంటుందని స్పష్టం చేసింది. యూనిఫామ్ విషయంలో విద్యార్థులకు వ్యక్తిగతంగా సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు లేదని తేల్చి చెప్పింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక పాఠశాలలో 11వ తరగతి ప్రవేశం కోసం హిజాబ్ అనుమతి కోరిన బాలిక పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజిత్ శుక్లాల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.