DMHO Arrest: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి (DM&HO) డాక్టర్ స్వర్ణకుమారి.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. జిల్లా కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో తనిఖీలు జరిపిన ఏసీబీ బృందం.. ఆమెను, ఆమెతో పాటు ఉన్న అధికారి శ్రీనివాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
ఎల్బీనగర్ పరిధిలో మూతపడిన ఒక ఫిజియోథెరపీ సెంటర్‌ను రీ ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలంటే రూ. 2 లక్షలు చెల్లించాలని డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎల్బీనగర్ వద్ద బాధితుడి నుంచి రూ. లక్ష మొత్తాన్ని ఆమె ప్రైవేట్ డ్రైవర్ స్వీకరించారు. డబ్బులు అందుకున్న వెంటనే ఆ విషయాన్ని ఫోన్ ద్వారా డీఎంహెచ్‌ఓకు ఆమె సహాయకుడు శ్రీనివాస్ తెలియజేశాడు. దీంతో పక్కా సమాచారంతో వ్యూహం పన్నిన ఏసీబీ అధికారులు డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, సహాయకుడు శ్రీనివాస్‌తో పాటు ఈ వ్యవహారంలో భాగమైన ఓ ప్రైవేట్ డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సమయంలోనే డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారిని ఏసీబీ బృందం చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అనంతరం ఆమెను శివరాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి సుదీర్ఘంగా విచారించారు. బాధితులను వేధిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడిన అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
