ఇరుముడి సినిమా కోసం!
మక్తల్ వెంకటరమణ థియేటర్ ఎదుట ధర్నా
మంచి ఆదరణ ఉన్న సినిమాను తీసివేయడంపై ఆగ్రహం
ఎవరి ఒత్తిడితో చిత్రం ప్రదర్శన ఆపేశారో చెప్పాలని నిలదీత
మినిట్ 2 మినిట్, మక్తల్ (ఆగస్ట్ 27): నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఇరుముడి సినిమా ప్రదర్శనను నిలిపివేయడం కలకలం రేపింది. మక్తల్‌లోని వెంకటరమణ థియేటర్ ఎదుట చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రేక్షకులు, గ్రామీణులు తీవ్ర స్థాయిలో ధర్నా చేపట్టారు. ఆదరణ పొందుతున్న చిత్రాన్ని చూడటానికి సొంత పనులను సైతం పక్కనపెట్టి థియేటర్‌కు వస్తే, హఠాత్తుగా సినిమాను తీసేసి వేరే చిత్రాన్ని ప్రదర్శించడమేమిటని యాజమాన్యాన్ని నిలదీశారు.
ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న తరుణంలో ఏ కారణంతో షో నిలిపివేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఈ నిర్ణయం తీసుకున్నారో థియేటర్ నిర్వాహకులు సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఇరుముడి సినిమా ప్రదర్శనను పునరుద్ధరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
