UPI యూజర్లకు బిగ్ రిలీఫ్.. రూ.2 వేల లోపు చెల్లింపులపై నో ఛార్జెస్!

UPI CHARGES

UPI CHARGES

UPI CHARGES: దేశంలో డిజిటల్ చెల్లింపులు జరిపే కోట్లాది మంది వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రూ.2 వేల వరకు జరిపే యూపీఐ (UPI) లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిమితి లోపు జరిపే చెల్లింపులపై నేరుగాగానీ, పరోక్షంగాగానీ వినియోగదారుల ఖాతాల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయవద్దని బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు తేల్చిచెప్పింది.

యూపీఐ లావాదేవీలతో పాటు రూ.2 వేల వరకు జరిపే రూపే డెబిట్ కార్డు చెల్లింపులకు సైతం ఎటువంటి ఛార్జీలు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో రూ.2 వేల పరిమితి దాటిన కొన్ని రకాల వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో దాదాపు రూ.24 వేల కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. పరిమాణం పరంగా 4 శాతంగా ఉన్న ఈ లావాదేవీలు, విలువ పరంగా చూస్తే యూపీఐ చెల్లింపుల్లో మూడింట రెండు వంతులుగా ఉన్నాయి.

సవరించిన పన్నుల, ఇతర చట్టాల (సవరణ) బిల్లు 2026 పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత ఈ కొత్త మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269ఎస్‌యూ ప్రకారం ఎలక్ట్రానిక్ విధానాల్లో జరిపే చెల్లింపులపై బ్యాంకులు విధించే కొన్ని రుసుముల మినహాయింపులను తొలగించారు. రూ.50 కోట్లకు పైగా వ్యాపార టర్నోవర్ కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.

ఈ ఆదేశాల ప్రకారం భీమ్‌-యూపీఐ, యూపీఐ-క్యూఆర్ కోడ్, రూపే డెబిట్ కార్డ్, ఈ-కామర్స్ సంస్థల ద్వారా జరిపే చెల్లింపులకు పూర్తి రక్షణ లభిస్తుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత ప్రోత్సహించడంతో పాటు సామాన్య వినియోగదారులు, చిన్న వ్యాపారులపైదన భారాలు పడకుండా ఉండేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.