కేసీఆర్ కంటతడి!
పెద్ది సుదర్శన్ రెడ్డిని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగం
నల్లబెల్లిలో కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ చీఫ్
పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా
మినిట్ 2 మినిట్, నర్సంపేట(ఆగస్ట్ 10): తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విచ్చేశారు. ఇటీవల అకాల మరణం చెందిన పెద్ది దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అశ్రునయనాలతో ఘన నివాళులర్పించారు.
అనంతరం పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుని కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో కంటతడి పెట్టుకుంటూ.. పార్టీకి ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ స్వయంగా అందజేశారు. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం చెరో కోటి రూపాయలు, కుటుంబ అవసరాల కోసం రూ.25 లక్షల చెక్కులను వారి చేతికి అందించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా వెన్నుదన్నుగా ఉంటుందని, ఏ కష్టం వచ్చినా తాను చూసుకుంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
