క్రెడిట్ కొట్టేయలేదు.. గౌరవించి నిలిచారు! కేరళ ఎమ్మెల్యే ఉదారతపై ప్రశంసల వర్షం

Kerala MLA

Kerala MLA

Kerala MLA: దేశ రాజకీయాల్లో క్రెడిట్ చోరీలు, ఒకరిపై ఒకరు కక్షసాధింపు చర్యలు సర్వసాధారణమైపోయిన వేళ.. కేరళ రాష్ట్రంలో ఓ అద్భుతమైన ఘటన వెలుగు చూసింది. పరిపక్వ ప్రజాస్వామ్యానికి (మెచ్యూర్డ్ డెమొక్రసీ) నిదర్శనంగా నిలిచేలా ప్రజాప్రతినిధులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. అధికారంలో ఉన్నవారు మారినా, ప్రజల సంక్షేమం, చేసిన పనికి దక్కాల్సిన గౌరవం మారకూడదని నిరూపిస్తూ కొట్టాయం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది.

కేరళలోని పూంజర్ నియోజకవర్గంలో ఒక గ్రామానికి కాలువ దాటేందుకు బ్రిడ్జి లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులను చూసి, గత ఎల్‌డీఎఫ్ (LDF) ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే సెబాస్టియన్ కలతుంకాల్ తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 80 లక్షలు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు.

అయితే ఇంతలోనే ఎన్నికలు రావడం, ఎల్‌డీఎఫ్ ఎమ్మెల్యే ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.జె. సెబాస్టియన్ కొత్త ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లోనో లేదా ఇతర ప్రాంతాల్లోనో అయితే గత ప్రభుత్వం చేపట్టిన పనులకు కనీసం ఆహ్వానం కూడా పంపకుండా, కొత్త నాయకులే ప్రారంభించి క్రెడిట్ కొట్టేయడం చూస్తుంటాం. కానీ పూంజర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం.జె. సెబాస్టియన్ అలా చేయలేదు. ఆ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు తెచ్చి, కష్టపడింది మాజీ ఎమ్మెల్యే అని, అందులో తన ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు.

ప్రోటోకాల్ నిబంధనలను కాదని అధికారులను సైతం ఒప్పించి, మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగానే ఆ బ్రిడ్జిని ప్రారంభించేలా పట్టుబట్టారు. స్వయంగా మాజీ ఎమ్మెల్యేను ఆహ్వానించి, ఆయనతోనే రిబ్బన్ కట్ చేయించి, ఆ పనికి సంబంధించిన క్రెడిట్ మొత్తాన్ని ఆయనకే కట్టబెట్టారు. ఈ అపూర్వ ఘట్టం ప్రజాస్వామ్య విలువలను ఎలుగెత్తి చాటింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఇలాంటి ఉన్నతమైన సాంప్రదాయాలను పాటిస్తే దేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గత ప్రభుత్వాల పేర్లు తుడిచేయడం, ప్రారంభోత్సవాల కోసం కొట్లాడుకోవడం, ప్రచార ఆర్భాటాలకు పోవడం వంటివి తగ్గుతాయి. రాజకీయ విభేదాలు ఎన్నికల వరకే పరిమితమని, ప్రజల అభివృద్ధే అంతిమ లక్ష్యమని చాటిచెప్పిన ఈ కేరళ ఘటన సమకాలీన రాజకీయాలకు ఓ గొప్ప మార్గదర్శి.