DSC Petitions: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి 2008 డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల వివాదంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. జీవో నంబర్ 28 సవరణను సవాల్ చేస్తూ.. డీఎస్సీ 2008 నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రూల్ 7కు ప్రావిజన్ జోడించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎస్సీ అభ్యర్థులు, బీఈడీ అభ్యర్థులు దాఖలు చేసిన మూడు రిట్ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది (డిస్మిస్ చేసింది). దీంతో దాదాపు 16 ఏళ్లుగా నలుగుతున్న ఈ సుదీర్ఘ న్యాయ వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడింది.
ఏళ్ల తరబడి సాగిన న్యాయపోరాటం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 డిసెంబర్లో 52,655 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో బీఈడీ, డీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు ఇద్దరూ పోటీపడవచ్చని పేర్కొంది. అయితే ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, 2009 జనవరి 29న ప్రభుత్వం జీవో నంబర్ 28ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఎస్జీటీ పోస్టులలో 30 శాతం పోస్టులను కేవలం డీఈడీ అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించి, మిగిలిన 70 శాతం పోస్టులకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులిద్దరికీ అవకాశం కల్పించారు.
దీంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని భావించిన బీఈడీ అభ్యర్థులు ముందుగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను, ఆ తర్వాత నాటి ఉమ్మడి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా 16 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం.. జీవో 28, రూల్ 7 జోడింపులో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించడంతో అభ్యర్థులకు చుక్కెదురైంది.
