UPI charges: పండుగ సీజన్లో డిజిటల్ చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులకు, వ్యాపారులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కీలక సమాచారం అందించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా వ్యాపారులకు చేసే కొన్ని రకాల లావాదేవీలపై ‘ఎమ్డీఆర్’ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఛార్జీలను దీపావళి పండుగ పూర్తయిన తర్వాత నుంచి అమలు చేయాలని ఎన్పీసీఐ నిర్ణయించింది.
ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొనడంతో మార్కెట్లలో కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి ఛార్జీల భారం మోపితే వ్యాపార లావాదేవీలకు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బంది కలగే అవకాశం ఉందని గుర్తించిన ఎన్పీసీఐ, ఈ కొత్త నిబంధనల అమలును తాత్కాలికంగా పండుగ ముగిసే వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పండుగ షాపింగ్లు సజావుగా సాగేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
త్వరలోనే తుది తేదీ ప్రకటన
దీపావళి పండుగ ముగిసిన తర్వాత ఈ ఎమ్డీఆర్ ఛార్జీలు ఖచ్చితంగా ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి? ఏ రకమైన వ్యాపార లావాదేవీలపై ఎంత శాతం రుసుము వర్తిస్తుంది? అనే పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు ఎన్పీసీఐ పేర్కొంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు సేవల నాణ్యతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే వ్యాపారులు, డిజిటల్ చెల్లింపుల యాప్లు వాడే ప్రజలు ఈ కొత్త మార్పులను గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.
