ఘోర రోడ్డు ప్రమాదం.. మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ మృతి

Mimicry Artist

Mimicry Artist

Mimicry Artist: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకున్న ప్రమాదంలో ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్ సత్యనారాయణ దుర్మరణం చెందారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో తన ప్రదర్శనను విజయవంతంగా ముగించుకుని కారులో తిరిగి ఇంటికి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

ఓఆర్‌ఆర్‌పై సత్యనారాయణ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఆ తీవ్రతకు ఒక్కసారిగా అదుపుతప్పిన కారు రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సత్యనారాయణ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సత్యనారాయణ ఆకస్మిక మృతి పట్ల పలువురు కళాకారులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.