Crime Control: పెరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేస్తూ, ప్రామాణికమైన అర్బన్ పోలీసింగ్ విధానాలతో నేరస్థులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర డిజిపి సి.వి. ఆనంద్ పోలీస్ అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు నిరంతరం గస్తీ, పటిష్ట నిఘా, మరియు సత్వర స్పందన అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లో సిపి బి. సుమతి, డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రజలు ‘డయల్ 112’కు చేసే ఫిర్యాదులపై పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తున్నారనే దానిపైనే వారి పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేస్తే నేరస్థుల కదలికలను సులువుగా నియంత్రించవచ్చని సూచించారు. బొల్లారంలోని గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య, ఆయుధాల చోరీ ఘటనలను ప్రస్తావిస్తూ.. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రతి కమ్యూనిటీలో తప్పనిసరిగా సీసీటీవీలు ఏర్పాటు చేయించాలన్నారు. ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నేపాల్ ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
మహిళలు, బాలికల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ, పోక్సో కేసుల్లో సాంకేతిక ఆధారాలతో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిర్ణీత గడువులోగా కోర్టుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. జవహర్నగర్, హయత్నగర్, కుషాయిగూడ, వనస్థలిపురం, కీసర పరిధిలో నమోదవుతున్న పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మురికివాడలు, బస్తీల్లోని నేరాల హాట్స్పాట్లను గుర్తించి, పాత రౌడీషీటర్ల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 2026లో ఇప్పటివరకు 23,747 కేసులు నమోదయ్యాయని సీపీ సుమతి వివరించగా.. రోజువారీగా పెరుగుతున్న సైబర్ నేరాలు, చోరీలు, మోసాల కట్టడికి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల్లోని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని డిజిపి అధికారులను ఆదేశించారు.
