Delimitation Bill: దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) రాజ్యాంగ సవరణ బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ సవరణ బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేక నిలిచిపోయిన ఈ బిల్లుల్లో విపక్షాలు, దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం కీలక మార్పులు చేసింది.
అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు
నూతన బిల్లు ప్రకారం.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సమాన నిష్పత్తిలో (50 శాతం) లోక్సభ, అసెంబ్లీ సీట్లను పెంచేలా ప్రతిపాదించారు. దీనివల్ల ఏ రాష్ట్రానికీ సీట్ల వాటా తగ్గే ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 543గా ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య ఈ పెంపుతో సుమారు 816కు చేరనుంది. ఈ నూతన సీట్ల కేటాయింపు నిష్పత్తి 2051 సంవత్సరం వరకు (25 ఏళ్ల పాటు) స్థిరంగా కొనసాగేలా బిల్లులో నిబంధన చేర్చారు.
నవంబర్ 30 నుంచి ప్రత్యేక సమావేశాలు
ఈ బిల్లుల ఆమోదం కోసమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. నవంబర్ 30న లోక్సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశం కానున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ బిల్లులను సభ ముందుకు తీసుకువస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు అధికార ఎన్డీయే కూటమి వ్యూహాలు రచిస్తుండగా, విపక్షాలు సైతం తమ తదుపరి కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నాయి.
