రెండుసార్లు మార్చినా మారని తీరు.. కామినేని ఫ్లైఓవర్ వద్ద మళ్లీ మృత్యుకుహరాలు!

Kamineni Flyover

Kamineni Flyover

Kamineni Flyover: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఎల్బీనగర్ కామినేని ఫ్లైఓవర్ సమీపంలో మ్యాన్‌హోల్స్ మరోసారి వాహనదారుల పాలిట మృత్యుకుహరాలుగా మారాయి. ఇక్కడి మ్యాన్‌హోల్ మూతలు ప్రమాదకరంగా మారడంపై గతంలో ‘మినిట్ 2 మినిట్’ వార్తా కథనాలను ప్రచురించగా, స్పందించిన అధికారులు ఇప్పటికి రెండుసార్లు కొత్త మూతలను ఏర్పాటు చేశారు. అయితే, ఆ మూతలు వేసిన కొద్దిరోజులకే మళ్లీ పూర్తిగా ధ్వంసమై, లోపలికి కుంగిపోయాయి.

నాసిరకం పనులా? అధికారుల నిర్లక్ష్యమా?

తాజాగా తీసిన దృశ్యాలను చూస్తే కాంక్రీటు మూతలు ముక్కలు ముక్కలై, ఇనుప చువ్వలు బయటకు తేలి అత్యంత భయానకంగా కనిపిస్తున్నాయి. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ప్రధాన రహదారిపై ఇలాంటి పరిస్థితి ఉండటంతో, ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఇవి కాంట్రాక్టర్లు వేస్తున్న నాసిరకం మూతలా? లేక భారీ వాహనాల రద్దీకి తట్టుకునేలా నాణ్యత ప్రమాణాలు పాటించడంలో అధికారుల తప్పిదమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం బారికేడ్లు పెట్టి చేతులు దులుపుకోకుండా, శాశ్వత ప్రాతిపదికన పటిష్టమైన మ్యాన్‌హోల్ మూతలను ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.