Financial Crisis: క్యాలెండర్లో ఒకటో తారీఖు వస్తోందంటే ఒకప్పుడు ఉద్యోగులు, సామాన్యుల ముఖాల్లో ఎక్కడలేని సంతోషం కనిపించేది. చేతికి జీతం వస్తుందన్న ఆనందం ఉండేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘అమ్మో ఒకటో తారీఖు!’ అంటూ మధ్యతరగతి మానవుడు బెంబేలెత్తిపోయే రోజులు వచ్చాయి. జీతం బ్యాంక్ ఖాతాలో పడకముందే, దాన్ని మింగేసేందుకు ఖర్చుల భూతం నోరు తెరుచుకుని సిద్ధంగా ఉంటోంది.
నడ్డి విరుస్తున్న ధరలు.. ఈఎంఐల ఉచ్చు
ఒకవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు మధ్యతరగతి మనిషి నడ్డి విరుస్తున్నాయి. చాలీచాలని జీతాలతో కుటుంబ అవసరాలు తీర్చలేక, తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డుల వైపు అడుగులు వేస్తున్నారు. సులభంగా వస్తున్నాయి కదా అని తీసుకున్న పర్సనల్ లోన్లు, వస్తువుల ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు, వాటిపై పడే భారీ వడ్డీలు, హిడెన్ ఛార్జీలు సామాన్యుడిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఒకటో తారీఖు రాగానే జీతంలో సగానికి పైగా ఈఎంఐలు, బిల్లుల రూపంలోనే ఖాతా నుంచి మాయమైపోతున్నాయి. ఇక లోన్ యాప్స్ పేరుతో జరుగుతున్న దందా మరో రకం. ఇవి ప్రాణాలు తోడేస్తున్నాయి.
బయటకు చెప్పుకోలేని ఆవేదన
సమాజంలో మధ్యతరగతి మనిషి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అటు పేదవాడిలా ప్రభుత్వ పథకాలకు అర్హులు కాలేక, ఇటు ధనవంతుడిలా విలాసవంతమైన జీవితాన్ని గడపలేక, పరువు కోసం పాకులాడుతూ లోలోపల కుమిలిపోతున్నారు. బయటకు చిరునవ్వుతో కనిపిస్తున్నా, లోపల మాత్రం ప్రతి రూపాయికీ లెక్కలు వేసుకుంటూ కుయ్యోమొర్రో అంటూ బతుకులీడుస్తున్నారు.
ఆదాయం పెరగకపోగా, ఖర్చులు మాత్రం రెట్టింపు అవుతుండటంతో జీతానికి, జీవితానికి మధ్య మధ్యతరగతి జీవులు నిత్యం నలిగిపోతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, అనవసరపు ఆడంబరాలకు దూరంగా ఉండటంతో పాటు, ప్రభుత్వాలు సైతం ధరల నియంత్రణపై దృష్టి సారించినప్పుడే ఈ వర్గానికి కాస్తయినా ఊరట లభిస్తుంది.
