అసెంబ్లీ రణరంగానికి ముహూర్తం ఫిక్స్.. డిసెంబర్ రెండో వారంలో సభ.. కృష్ణా, కాళేశ్వరంపై మాటల తూటాలు!

Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly:  తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. డిసెంబర్ రెండో వారంలో మొత్తం మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తుండగా, ఇందుకోసం డిసెంబర్ 14, 15 తేదీలను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సమావేశాల తేదీలు, ఎజెండాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

వాడీవేడిగా సాగనున్న చర్చలు

ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పలు కీలక అంశాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాల వాటాలో రాష్ట్రం హక్కులు, నీటి కేటాయింపులు కోల్పోయిందన్న అంశంపై అధికార పక్షం విమర్శలు సంధించేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్షం సైతం తమ వాదనతో గట్టి కౌంటర్ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది.

రైతుల సమస్యలు, కొత్త బిల్లులపై దృష్టి

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కలిగిన నష్టాలకు సంబంధించిన అంశాలపై సభలో పదునైన చర్చ జరగనుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, వర్షపాతం, నీటి లభ్యతపై ఎల్‌నినో ప్రభావం, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు దృష్టి సారించనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు వివిధ అంశాలపై నివేదికలను సభ ముందుంచనుంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై ఇరుపక్షాల మధ్య మాటల తూటాలు పేలే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.