Film Festival: ప్రపంచ సినిమా ప్రేమికులు, యువ ఫిలిం మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ (HISFF) సీజన్-2కు రంగం సిద్ధమైంది. గతేడాది తొలి సీజన్‌తో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రోత్సవం, ఈసారి మరింత భారీ స్థాయిలో అలరించేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వ యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ (YATC) సహకారంతో, దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఆధ్వర్యంలో 2027 జనవరి 27 నుంచి 31 వరకు ఐదు రోజుల పాటు భాగ్యనగరం వేదికగా ఈ వేడుక జరగనుంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన ఈ వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం తాజాగా పర్యాటక భవన్లో ఘనంగా జరిగింది.
యువ ప్రతిభకు అంతర్జాతీయ వేదిక
ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్, వైఏటీసీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ (ఐఏఎస్), టూరిజం ఎండీ క్రాంతి (ఐఏఎస్), ఫెస్టివల్ నిర్వాహకులు ‘అంకురం’ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపాల్ నందన్ బాబు తదితరులు పాల్గొని ఫెస్టివల్ విశేషాలను పంచుకున్నారు. యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని సమాజం పట్ల బాధ్యతాయుతమైన కళాకారులుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని విజయేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. యువతతో ఎక్కువగా షార్ట్ ఫిల్మ్స్ తీయించాలని ఆయన సూచించారు. మరోవైపు, తమ సంస్థ తరఫున ఔత్సాహిక దర్శకుల కోసం నెలకు రెండు లఘు చిత్రాలు నిర్మించేందుకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ స్కూల్ ప్రిన్సిపాల్ నందన్ బాబు వెల్లడించారు.
ప్రభుత్వ ప్రోత్సాహం.. ప్రపంచ దేశాల చిత్రాల సమాగమం
ప్రపంచం నలుమూలల నుంచి ఊహించనన్ని వైవిధ్యభరితమైన కథలు, అద్భుతమైన లఘు చిత్రాలతో పాటు ప్రఖ్యాత జ్యూరీ సభ్యుల సమక్షంలో సాగే ఈ సీజన్-2 యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటుందని టూరిజం ఎండీ క్రాంతి ధీమా వ్యక్తం చేశారు. సాంస్కృతిక విలువలను పెంపొందిస్తూ సామాజిక స్పృహను కలిగించే ఇటువంటి కార్యక్రమాలకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సంపూర్ణ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని వాణీ ప్రసాద్ పేర్కొన్నారు. ఫెస్టివల్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిన ప్రత్యేక సందేశం నిర్వాహకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
‘వసుధైక కుటుంబం’ నినాదంతో ఐదు రోజుల ఫిల్మ్ ఎక్స్పో
ఎల్లలు, వేర్పాటువాదాలకు అతీతంగా ‘ప్రపంచమంతా ఒక్కటే – మనమంతా వసుధైక కుటుంబం’ అనే మహోన్నత ఆశయంతో ఈ ఫెస్టివల్‌కు రూపకల్పన చేసినట్లు నిర్వాహకులు అంకురం ఉమామహేశ్వరరావు తెలిపారు. సీజన్-2 కోసం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రముఖులతో కూడిన ప్రత్యేక అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేశామని, ఫెస్టివల్లో భాగంగా ఐదు రోజుల పాటు భారీ ‘ఫిల్మ్ ఎక్స్పో’ కూడా నిర్వహించనున్నామని ఆయన వివరించారు. ప్రపంచ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జ్యో పాలో మాచిడో సహా పలువురు అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు ఈ వేడుకకు తమ మద్దతు తెలుపుతూ సందేశాలు పంపారు. వర్క్‌షాప్‌లు, మాస్టర్ క్లాసులు, సినీ ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమాలతో సాగనున్న ఈ చిత్రోత్సవం, ఔత్సాహిక సినీ రూపకర్తలకు ఒక సువర్ణావకాశంగా నిలవనుంది.
