కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తే ఇంతే! తమిళనాడు సీఎస్, డీజీపీలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు

Thiruparankundram Deepam

Thiruparankundram Deepam

Thiruparankundram Deepam: తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై ‘కార్తిక మహాదీపం’ వెలిగించే వివాదం అత్యంత నాటకీయ మలుపు తిరిగింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ కొండపై ఉన్న పురాతన రాతిస్తంభంపై దీపం వెలిగించాల్సిందేనని తేల్చి చెప్పడమే కాకుండా, తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి షాక్ ఇచ్చింది.

అసలేమిటీ వివాదం? ఇప్పటివరకు ఏం జరిగింది?

తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఏళ్లుగా ఉచ్చిప్పిళ్లైయార్‌ ఆలయ దీప మండపంపైనే కార్తిక దీపం వెలిగిస్తున్నారు. అయితే కొండపై ఉన్న సిక్కందర్‌ దర్గా సమీపంలోని పురాతన రాతిస్తంభంపైనే దీపం వెలిగించాలనే అంశంపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. గతేడాది మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం అక్కడే దీపం వెలిగించాలని ఆదేశించినా అమలు కాలేదు. ఈ ఏడాది వివాదం సుప్రీంకోర్టుకు చేరగా, కేవలం ఈ ఏడాదికి మాత్రమే రాతిస్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ, ఇటీవల కార్తిక పౌర్ణమి నాడు అధికారులు పాత పద్ధతిలోనే ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయం వద్దే దీపం వెలిగించడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.

సీఎస్, డీజీపీలకు నోటీసులు.. సీఆర్పీఎఫ్‌కు భద్రత

విచారణ సందర్భంగా తమను రాతిస్తంభం వద్దకు వెళ్లకుండా తమిళనాడు పోలీసులు అడ్డుకున్నారని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కోర్టు దృష్టికి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వాదనను తోసిపుచ్చినప్పటికీ, అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరణ అవుతోందని స్పష్టం చేస్తూ.. తమిళనాడు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మదురై కలెక్టర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆలయ ట్రస్టీల బోర్డును తక్షణమే సస్పెండ్ చేసిన ధర్మాసనం, రాష్ట్ర పోలీసులను పక్కనపెట్టి కొండ, ఆలయ భద్రత బాధ్యతలను సీఆర్పీఎఫ్‌కు అప్పగించింది. ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తే సహించబోమని సుప్రీంకోర్టు కఠినంగా హెచ్చరించింది.