Hyderabad: హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలానికి మార్గం సుగమమైంది. ఈ భూముల వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన వేర్వేరు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) యథావిధిగా భూముల వేలం నిర్వహించేందుకు సిద్ధమైంది.
పిటిషన్లను తోసిపుచ్చిన ధర్మాసనం
ట్రక్ పార్క్ కోసం కేటాయించిన భూములను యథాతథంగా ఉంచాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఒక పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా, సదరు భూములను ప్రైవేటు సంస్థలకు గానీ, వ్యక్తులకు గానీ కేటాయించకుండా, కబ్జాలకు గురికాకుండా ప్రభుత్వం తక్షణమే కంచె వేసి రక్షణ చర్యలు చేపట్టాలని ట్రక్ పార్క్ అసోసియేషన్ మరో పిటిషన్ వేసింది. ఈ రెండు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ పి. సామ్ కోషిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, దాఖలైన రెండు పిటిషన్లకు ప్రజా ప్రయోజనాలతో (పబ్లిక్ ఇంట్రెస్ట్) సంబంధం లేదని పేర్కొంటూ ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది.
షెడ్యూల్ ప్రకారమే వేలం
హైకోర్టు తీర్పుతో ట్రక్ పార్క్ భూముల వేలానికి అడ్డంకులు తొలగిపోయాయని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత వేలంపాట ప్రారంభిస్తామని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మొత్తం 3.1 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమికి కనీస ధరగా అధికారులు రూ.90 కోట్లుగా నిర్ణయించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ వేలంపాటపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
