journalist:జర్నలిస్టులు అంటే…మంట ఎందుకంటే?

మినిట్ 2 మినిట్, జర్నలిజం విలువలు :కుటుంబంలో ఒక నవ దంపతుల పంచాయితీకి నన్ను బలవంతాన తీసుకుపోయారు ఆ మధ్య. నేను ప్రధాన మీడియా స్రవంతికి దూరంగా ఉన్నా… నన్ను అక్కడ జర్నలిస్టుగా పరిచయం చేశారు. నేను గతంలో పనిచేసిన ఒక ప్రముఖ దినపత్రిక పేరుచెప్పి నేను దాని జర్నలిస్టునని కూడా చెప్పారు. నేనిప్పుడు ఆ పత్రికలో లేనని చెప్పేలోపే, నా భార్య కూడా టీవీ జర్నలిస్టు అని చెప్పారు. ఆమె కూడా ఇపుడు మీడియాలో పనిచేయడం లేదు. మాతో పెట్టుకుంటే మీ పరువు తీయడానికి మా దగ్గర మీడియా ఆయుధం సిద్ధంగా ఉన్నదన్నట్లు ఆ పరిచయం సాగింది. నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇక్కడ పది మంది మధ్య సవరణ కన్నా పంచాయితీ ముఖ్యం కాబట్టి కిమ్మనకుండా ఉండి నా మేర నా పాత్ర పోషించి బయటపడ్డాను. అంతా అయ్యాక, పరిచయకర్త చెవిలో చెప్పాను… నేను ఎప్పుడో ఆ పత్రిక మారానని. “తెలుసులేవోయ్… అట్లా చెప్పబట్టే వాళ్ళు నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడారు. వ్యవహారం కొలిక్కి వచ్చింది,” అన్నాడు. జర్నలిస్టు వాడుకునే వాళ్లే కాదు, జర్నలిస్ట్ ను బూచిగా వాడుకునే వాళ్లు కూడా ఉంటారు. పెద్ద పెద్ద జర్నలిస్టుల పేర్లు చెప్పి, వాళ్ళు తమ ఖాస్ దోస్తులని చెప్పి ఒకరకమైన ధీమాతో ఆనందించే వాళ్లను మీరు కూడా చూసే ఉంటారు.

మర్డరర్, జర్నలిస్టు, పోలీసు, లాయర్, పొలిటీషియన్ అంటే జనాలకు కొద్దిగా భయం ఉంటుంది… అదే వరసలో. ఇందులో రెండో వాడంటే (జర్నలిస్టు) గతంలో (రమారమి 1990 దాకా) గౌరవంతో కూడిన భయం ఉండేది. కొండకచో వ్యక్తిగత నడవడిక, నాణ్యత వల్ల భక్తి కూడా ఉండేది. ఇప్పుడు జర్నలిస్టులు అంటే అసహ్యంతో, అగౌరవంతో కూడిన భయం కనిపిస్తోంది. ఈ ఫేస్ బుక్ లో దాదాపు అంతా మీడియా మీద అలవోకగా నోటికొచ్చిన కామెంట్ చేస్తుంటారు. అందరూ తిట్టడమే. ఒక గుండు బాస్ అయితే తన ప్రతి పోస్టులో జర్నలిస్టులను పరమ భయంకరమైన మాటలతో తిడతాడు. శుద్ధంకాని దాని మీద రాయి వేయడం ఎందుకని వదిలేస్తాను. తమ బోడి భావాలకు అనుగుణంగా లేకపోతే మొత్తం మీడియాని తిట్టడం తప్పన్న ఇంగితం లేని చదువుకున్న మూర్ఖుల బ్యాచ్! మీడియా మొత్తం కమ్యూనిస్టులు ఉన్నారన్న గుడ్డి ఫిలాసఫీ తో ఉంటాయి కామెంట్లు.

బిల్డింగ్ కట్టుకుంటున్నా… మరి మాకేంటి? అనే ‘జర్నలిస్టులు’, ప్రతి అమాం బాపతు యూట్యూబర్ కూడా గొట్టం పట్టుకుని జర్నలిస్టుగా మోరవిరిచి క్లెయిమ్ చేసుకోవడం, జబర్దస్తీ చేయడంతో ఈ దుస్థితి దాపురించింది. స్వీపింగ్ స్టేట్మెంట్స్ యుగం కాబట్టి ఆ పవిత్రమైన వృత్తి కూడా ఎక్కువ విమర్శల పాలవుతోంది. మేనేజ్మెంట్స్ కూడా వృత్తికి పరువు తెచ్చే పనులు చేయకపోవడం విచారకరం.

ఎథికల్ జర్నలిజం అన్న అంశం మీద నన్ను ఈ మధ్య ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు..జర్నలిస్టిక్ ఎథిక్స్ మీద నేను PhD పట్టా పొంది ఉండడం వల్ల. ఈ రోజుల్లో జర్నలిజం ఎక్కడ? ఉన్నదంతా ఎర్నలిజం మాత్రమే కదా? అన్నారు అక్కడ. ప్రధాన మీడియా దాదాపు అంతా రాజకీయంగా కొమ్ముకాస్తూ, కుమ్మేస్తున్న నేపథ్యంలో ఈ అభిప్రాయం కలగడం సహజం. కానీ అందరినీ ఒకే గాటన కడితే ఎట్లా? అన్నది నా బాధ.

గుట్టుగా ఉండాలనుకోవడం మానవ సహజం. అందుకే తమ మాట నలుగురికి చాటింపు వేసేవారికి దూరంగా ఉంటారు జనం. సమాచారాన్ని సేకరించి అందరికీ చాటిచెప్పే వృత్తిలో ఉన్న జర్నలిస్టులు అందుకే చాలా మందికి కంటగింపు అయ్యారు.
జర్నలిజం పట్ల మీకు దురభిప్రాయం ఉందా?లేక అందరితో పాటు మీరు కూడా ఒక బండ వేస్తున్నారా? దురభిప్రాయం ఉంటే అందుకు కారణం ఏమిటో ఒక అకాడమిక్ డిస్కషన్ కోసం కామెంట్ గా రాసి పుణ్యం కట్టుకోండి.
మౌలికంగా జర్నలిస్టులు అంటే జనాలలో దురభిప్రాయం కలగడానికి కారణం ఒకటి ఉంది.
అది తదుపరి పోస్టులో.

Name
ఎస్. రాము
సీనియర్ విశ్లేషకులు