Mule Accounts: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ సామాన్య ప్రజల పాలిట శాపంగా మారుతోంది. ఎలాంటి కష్టం లేకుండా నెలనెలా ఐదు వేల నుంచి పది వేల రూపాయల వరకు కమీషన్ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు, బెట్టింగ్ రాయుళ్లు విసురుతున్న వలకు ఎంతో మంది అమాయకులు చిక్కుకుంటున్నారు. తమ నేరాల ఆనవాళ్లు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు కేటుగాళ్లు అమాయకుల బ్యాంక్ ఖాతాలను అద్దెకు తీసుకుంటూ కొత్త తరహా మోసాలకు తెరలేపారు. నేర పరిభాషలో వీటినే ‘మ్యూల్ అకౌంట్లు’ (Mule Accounts) అంటారు.
ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు?
ముఖ్యంగా ఆర్థిక అవసరాలు ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు, రోజువారీ కూలీలు, చిరుద్యోగులే లక్ష్యంగా ఈ ముఠాలు పనిచేస్తున్నాయి. మీ పేరుపై కొత్త బ్యాంక్ అకౌంట్ తెరిచి, దానికి సంబంధించిన ఏటీఎం కార్డు, చెక్ బుక్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లతో పాటు ఆ ఖాతాకు అనుసంధానమైన సిమ్ కార్డును తమకు అప్పగిస్తే చాలు, ప్రతి నెలా కొంత మొత్తం కమీషన్ ఇస్తామని ఆశ చూపుతున్నారు. కొందరు తెలిసీ తెలియక, మరికొందరు అత్యాశకు పోయి తమ బ్యాంక్ ఖాతాలను అపరిచితుల చేతుల్లో పెడుతున్నారు.
అసలు ప్రమాదం ఎక్కడ ఉంది?
ఇలా సేకరించిన ఖాతాల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు, సైబర్ నేరగాళ్లు కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు నడుపుతున్నారు. మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు, నగదు ఏ బ్యాంక్ ఖాతాకు వెళ్లిందో పోలీసులు ట్రాక్ చేస్తారు. బ్యాంక్ రికార్డుల ప్రకారం ఆ ఖాతా ఎవరి పేరుపై ఉంటే వారే అసలు నిందితులుగా మారతారు. దీంతో తెరవెనుక ఉన్న అసలు సూత్రధారులు దర్జాగా తప్పించుకుంటే, కేవలం ఐదు వేల రూపాయల కమీషన్ కోసం కక్కుర్తి పడిన సామాన్యులు సైబర్ క్రైమ్ కేసుల్లో మొదటి ముద్దాయిలుగా మారి జైలు పాలవుతున్నారు.
పోలీసుల హెచ్చరిక ఇదే!
మీ బ్యాంక్ ఖాతా ఇతరుల చేతికి ఇచ్చారంటే, రేపు జరిగే ప్రతి నేరానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కమీషన్ల ఆశకు పోయి మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, సిమ్ కార్డులను ఎవరికీ ఇవ్వకూడదని, అనుమానాస్పద లావాదేవీలు జరిగితే తక్షణమే బ్యాంకు అధికారులకు లేదా 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
