telangana: ఎస్సై కాళ్లపై పడి రైతు కన్నీళ్లు !

ఎస్సై కాళ్లపై పడి రైతు కన్నీళ్లు

నీరు లేక ఎండిపోతున్న పంటను కాపాడాలని ధర్నా

ఖమ్మం జిల్లా వైరా నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద ఆందోళన

ఎస్సై రామారావు కాళ్లు పట్టుకున్న తల్లాడ రైతు బోడేపూడి మాధవరావు

మినిట్ 2 మినిట్, వైరా(ఆగస్ట్ 18): ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి సాగునీరు విడుదల చేయాలంటూ ఒక రైతు అధికారుల కాళ్లపై పడి వినూత్న రీతిలో నిరసన తెలిపిన సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది. బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం (ఎమ్మెల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన రైతు బోడేపూడి మాధవరావు, లింగన్నపాలెం రెవెన్యూ పరిధిలోని తన నాలుగు ఎకరాల వరి పంట నీరు లేక ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ, అక్కడకు వచ్చిన వైరా ఎస్సై పుష్పాల రామారావు కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు.

అంతకుముందు నీటిపారుదల శాఖ డీఈ నాగబ్రహ్మయ్యతో రైతు నాయకులు చర్చలు జరపగా, ఎల్ నినో ప్రభావం వల్ల ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకే నీటిని విడుదల చేయలేకపోతున్నామని వివరణ ఇచ్చారు. అయితే గత రాత్రే కుడి, ఎడమ కాలువలకు నీటిని ఎలా వదిలారంటూ నాయకులు ప్రశ్నించారు. అనంతరం ఎస్సై రామారావు రైతులతో, నాయకులతో మాట్లాడి చర్చలు జరిపారు.