లక్షలాది ఓటర్ల వివరాలు అన్-కలెక్టెడ్
అర్బన్ ప్రాంతాల్లో తీవ్ర అలసత్వం
ఆగస్ట్ 17న ముసాయిదా ప్రచురణ
ఓటర్లు సరిచూసుకోవాలని అధికారుల సూచన
మినిట్ 2 మినిట్, రంగారెడ్డి (ఆగస్ట్ 12): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (SIR) ప్రక్రియ సంచలనాత్మక వివరాలను వెల్లడిస్తోంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 36,99,743 మంది నమోదిత ఓటర్లు ఉండగా, వారిలో దాదాపు 12,86,720 (34.78%) మందికి సంబంధించిన ఎలక్టర్ ఫారమ్‌లు (EFs) బీఎల్ఓల చేతికి చిక్కలేదు. ఇళ్లు తాళాలు వేసి ఉండటం, ఇల్లు షిఫ్ట్ అవ్వడం లేదా వలస వెళ్లడం వల్ల ఈ ఫారమ్‌లను సేకరించలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు.
పట్టణాల్లోనే అసలు సమస్య!
నగర శివారు నియోజకవర్గాల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. ఎల్బీ నగర్లో 44.48% (2,70,535 ఓట్లు), శేరిలింగంపల్లిలో 42.59% (3,29,360 ఓట్లు), రాజేంద్రనగర్‌లో 38.92% (2,47,244 ఓట్లు) ఫారమ్‌లు సేకరించలేకపోయిన జాబితాలో ఉండిపోయాయి. ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న శేరిలింగంపల్లి, నివాస ప్రాంతమైన ఎల్బీ నగర్లలో అత్యధికంగా నమోదు కాకపోవడం కలకలం రేపుతోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాలైన కల్వకుర్తిలో కేవలం 11.61%, షాద్‌నగర్‌లో 14.45% మాత్రమే అన్-కలెక్టెడ్ ఫారమ్‌లు ఉండటం గమనార్హం.
జాబితాలో తప్పులు.. గందరగోళం!
అన్-కలెక్టెడ్ ఫారమ్‌లతో పాటు జిల్లావ్యాప్తంగా 22,023 (0.60%) ఓటర్ల వివరాల్లో తీవ్ర వ్యత్యాసాలు (ASD discrepancies – అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్) ఉన్నట్లు గుర్తించారు. అలాగే 51,083 (1.38%) ఫారమ్‌లలో సమాచార లోపాలు బయటపడ్డాయి.
ఓటర్లు ఏం చేయాలి?
ఎలక్షన్ కమిషన్ ముసాయిదా ఓటర్ల జాబితాను ఆగస్ట్ 17న ప్రచురించనుంది. ఈ జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా లేదా స్థానిక బీఎల్ఓ వద్ద సరిచూసుకోవడం అత్యవసరం. ఒకవేళ పేరు లేకపోయినా లేదా అభ్యంతరాలు ఉన్నా, సెప్టెంబర్ 16 వరకు కొత్తగా ఫారమ్-6 దాఖలు చేసి ఓటు హక్కును పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓటర్లు అప్రమత్తంగా ఉండకపోతే రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
