TELANGANA: ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున సమకూరనున్న ఆదాయం !

రాయదుర్గంలో ఎకరం రూ.264 కోట్లు..
రికార్డులు తిరగరాసిన భూ వేలం!

టీజీఐఐసీ వేలంపాటలో ఆల్ టైమ్ రికార్డు ధర

దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే సంచలనం

5.25 ఎకరాల స్థలానికి ఊహించని రీతిలో పెరిగిన పోటీ

ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున సమకూరనున్న ఆదాయం

మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (ఆగస్ట్ 22): హైదరాబాద్ మహానగర ఐటీ కారిడార్‌లో భూముల ధరలు మునుపెన్నడూ లేని రీతిలో ఆకాశాన్ని తాకుతూ రియల్ ఎస్టేట్ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. తాజాగా తెలంగాణ పారిశ్రామిక ప్రాథమిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన ఇ-వేలంపాటలో రాయదుర్గంలోని ఒక ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడుపోయి భారత్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.

రాయదుర్గం సర్వే నంబర్ 83/1 పరిధిలోని ఫాన్ మకాంలో ఉన్న 5.25 ఎకరాల స్థలానికి టీజీఐఐసీ ఇటీవల వేలం నిర్వహించింది. ఐటీ కారిడార్, మైండ్ స్పేస్, నాలెడ్జ్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అత్యంత సమీపంలో ఈ స్థలం ఉండటంతో దిగ్గజ రియల్ ఎస్టేట్, నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. గతంలో మే 2026లో నిర్వహించిన వేలంలో ఇదే సర్వే నంబర్‌లోని 6.29 ఎకరాల భూమి ఎకరం రూ.237 కోట్లు పలకగా, జూన్ 2026లో మరో 5.09 ఎకరాల ప్లాట్ ఎకరం రూ.204 కోట్లకు అమ్ముడుపోయింది. తాజాగా ఆ రికార్డులన్నీ తిరగరాస్తూ ఎకరం రూ.264 కోట్లకు చేరుకోవడం గమనార్హం.