పేదోడి బడి అధ్వాన్నం!
ఏళ్లుగా నినాదాలు మారుతున్నా.. మారని బడులు
కోట్లాది రూపాయల ప్రజాధనం ఏమవుతోంది?
ఉద్యమ వీరులు ఎక్కడ? హక్కుల గళాలు ఏమయ్యాయి?
పసిపిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
బడిని బాగు చేసేందుకు ముందుకు రారా?
శిథిల గోడలు, పాము కాట్లు ఇవేనా బడి చదువులంటే?
తెలుగు రాష్ట్రాల్లో బడులపై మినిట్ 2 మినిట్ ప్రత్యేక కథనం
మినిట్ 2 మినిట్, ట్రెండింగ్ టాపిక్: ప్రభుత్వాలు మారుతున్నాయి.. నినాదాలు మారుతున్నాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో పేదపిల్లలు చదివే ప్రభుత్వ బడుల దుస్థితి మాత్రం మారడం లేదు. ‘భారత్ వెలిగిపోతోంది’ అని కేంద్ర పెద్దలు పదేపదే చెబుతుంటారు. మరోవైపు ఒకరు ‘బంగారు తెలంగాణ’ అని, ఇంకొకరు ‘రైజింగ్ తెలంగాణ’ అని గొప్పలు చెప్పుకొంటారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ‘స్వర్ణాంధ్ర’ అని, ‘నాడు-నేడు’ అని పథకాల పేర్లతో కోట్ల రూపాయల ప్రచారాలు హోరెత్తిస్తారు. చివరికి క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే పేదోడి బడి అభద్రతా నిలయంగానే మిగిలిపోతోంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు సర్కారీ విద్యా వ్యవస్థ దుస్థితికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. వర్షం వస్తే చాలు కూలిపోయేలా ఉన్న గోడలు, కనీసం ఆవరణ చుట్టూ ప్రహరీ లేక లోపలికి వచ్చే పాములు, తేళ్లతో పిల్లల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. నిన్నగాక మొన్న బడికి వెళ్లిన అభంశుభం తెలియని పసిపిల్లలు, అధికారుల నిర్లక్ష్యానికి బలై ప్రాణాలు కోల్పోయిన ఘోరాలు అందరినీ కలచివేశాయి. అసలు ఈ పసిపాపల ప్రాణాలకు బాధ్యత ఎవరు వహిస్తారు? విద్యాశాఖ అధికారులా? ఏమీ పట్టనట్లు ఉండే ప్రభుత్వ పెద్దలా?
ఇటీవల మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఇచ్చిన నివేదికలు కూడా సర్కారీ బడుల దుస్థితిని తేటతెల్లం చేశాయి. శ్లాబులు పెచ్చులు ఊడిపడటం, మరుగుదొడ్లు లేకపోవడం, తాగడానికి మంచి నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో వేలాది మంది పిల్లలు చెట్ల కింద, వర్షంలో నానుతూ పాఠాలు వినాల్సిన దుస్థితి దాపురించింది. మరోవైపు సర్కారీ బడుల పరిస్థితిపై దేశవ్యాప్తంగా యువత గళమెత్తుతోంది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ (రండి.. బడులను బాగు చేద్దాం) క్యాంపెయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశంగా మారింది. మన ఊరి బడుల దుస్థితిపై ప్రభుత్వం నుంచి గడిచిన ఐదేళ్ల డేటాను డిమాండ్ చేస్తూ, ప్రత్యక్షంగా బడుల వద్ద సోషల్ ఆడిట్ చేయడానికి సిద్ధపడుతున్న వారిని కూడా అధికారులు అడ్డుకోవడం కలకలం రేపుతోంది.
పేద పిల్లలకు నాణ్యమైన చదువుతో పాటు సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. కోట్ల రూపాయలు ప్రచారాలకు ఖర్చు చేసే పాలకులు.. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ బడుల భద్రతపై దృష్టి పెట్టాలి. నాణ్యమైన మౌలిక వసతులు కల్పించి, బడులను మృత్యుకూపాలుగా మారకుండా కాపాడాలి.
