FSSAI: కలర్ లేబులింగ్ విధానాన్ని వెనక్కి తీసుకున్న FSSAI !

ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ‘రెడ్’ వార్నింగ్‌కు మంగళం!?

కలర్ లేబులింగ్ విధానాన్ని వెనక్కి తీసుకున్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
మల్టీ నేషనల్ కంపెనీల ఒత్తిళ్లే కారణమా?
ప్రజా ఆరోగ్యం కంటే కార్పొరేట్ లాభాలే ఎక్కువయ్యాయా?
సుప్రీం కోర్టు మెట్లెక్కిన ప్రజారోగ్య కార్యకర్తలు

మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (ఆగస్ట్ 26): వినియోగదారుల ఆరోగ్య భద్రత విషయంలో భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. సాఫ్ట్ డ్రింక్స్, చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు వంటి ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు పరిమితికి మించి ఉంటే ప్యాకెట్ ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా ‘రెడ్ ఫ్లాగ్’ (ఎరుపు రంగు రౌండ్) హెచ్చరిక మార్కులు ముద్రించాలనే ప్రతిపాదనను నియంత్రణ సంస్థ ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ ఆహార తయారీ సంస్థలు, బహుళజాతి కంపెనీల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత, ఒత్తిళ్ల కారణంగానే ఈ కీలక నిబంధనను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.

ఎరుపు రంగు హెచ్చరిక సంకేతాలు ముద్రిస్తే కొనుగోలుదారులు భయపడతారని, అది వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనేది ఫుడ్ కార్పొరేట్ కంపెనీల వాదన. దీంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎరుపు రంగు హెచ్చరికలకు స్వస్తి చెప్పి, కేవలం సాధారణ ‘నలుపు-తెలుపు’ (బ్లాక్ అండ్ వైట్) రంగుల్లోనే పోషకాల శాతాన్ని తెలిపే పట్టికలను అంగీకరించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే, అధిక మోతాదులో ఉండే హానికర పదార్థాల గురించి తెలియజేసేందుకు ఈ నలుపు-తెలుపు సూచికలు ఎంతవరకు ఉపయోగపడతాయనే దానిపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. బహుళజాతి కంపెనీల వ్యాపార ప్రయోజనాల కంటే దేశ పౌరుల ఆరోగ్య రక్షణే ముఖ్యమని, సదరు పదార్థాల దుష్ప్రభావాలపై స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ న్యాయస్థానం స్పష్టం చేసినట్లు సమాచారం. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, పౌర హక్కుల సంఘాలు ప్యాకేజ్డ్ ఫుడ్స్ మితిమీరిన వాడకంపై పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టాయి. నియంత్రణ మండలి వెనక్కి తగ్గినా.. వినియోగదారులను చైతన్యపరచడానికి ఈ తరహా పోరాటాలు ముమ్మరం కానున్నాయి.