KURNOOL: పందిపిల్లకు పాలిచ్చిన ఆవు!

పందిపిల్లకు పాలిచ్చిన ఆవు!

కర్నూలు జిల్లా వెల్దుర్తిలో అరుదైన దృశ్యం

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

మినిట్ 2 మినిట్, కర్నూలు (ఆగస్ట్ 27):  మాతృత్వానికి జాతి భేదాలు సరిహద్దులు కావని చాటిచెప్పే హృదయవిదారక ఘట్టం కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వెలుగు చూసింది. ఆకలితో అలమటిస్తున్న ఒక పందిపిల్ల రోడ్డుపై వెళ్తున్న ఆవును సమీపించి పాలు తాగడం ప్రారంభించింది. సాధారణంగా ఇతర జీవులను దరిదాపుల్లోకి రానివ్వని మూగజీవాలు ఉన్న ఈ రోజుల్లో, ఆ గోమాత మాత్రం సదరు పందిపిల్లను ఎంతమాత్రం తోసిపుచ్చకుండా తన కడుపున పుట్టిన దూడలా భావించి పాలివ్వడం విశేషం.

వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఈ అపూర్వ సన్నివేశం చోటుచేసుకుంది. వీధిలో వెళ్తున్న బాటసారులు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. స్థానికుడు ఒకరు ఈ భావోద్వేగ ఘట్టాన్ని కెమెరాలో బంధించి డిజిటల్ వేదికలపై పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. బిడ్డ ఆకలి తీర్చడంలో తల్లి ప్రేమకు మించిన నిష్కల్మషమైన బంధం మరొకటి లేదని, గోమాత చూపిన ఈ కరుణ నూతన శకానికి సరికొత్త సందేశమని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.