AI : ఏఐ డిజిటల్ లూప్‌హోల్స్.. సైబర్ నేరగాళ్ల సరికొత్త వ్యూహాలు!

ఏఐ డిజిటల్ లూప్‌హోల్స్.. సైబర్ నేరగాళ్ల సరికొత్త వ్యూహాలు!
సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా న్యాయ విద్యలో సంచలన మార్పులు రావాలి
సైబర్ భద్రత, నియంత్రణ సమస్యలపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ సదస్సులో ఏఐ డేటా ముప్పుపై హెచ్చరిక

మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 23): ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం ఎంత వేగంగా పెరుగుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా విస్తరించే ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వేదికగా ‘సమకాలీన చట్టపరమైన, నియంత్రణ సమస్యలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన ఏఐ టెక్నాలజీతో వస్తున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక కాలంలో ఏఐ (AI) రాకతో డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ (సమాచార బదిలీ, మార్పిడి) ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతోందని గుర్తుచేశారు. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటుండటంతో, నేరాల విచారణలో దర్యాప్తు సంస్థలకు, న్యాయ వ్యవస్థలకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. నేరాలు చేసే విధానం డిజిటల్ రూపంలోకి మారుతున్నందున వాటినటెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో న్యాయపరమైన చిక్కులు కూడా అంతే వేగంగా పుట్టుకొస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ తరహా సైబర్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే, కేవలం దర్యాప్తు విధానాల్లోనే కాకుండా న్యాయ విద్యా విధానంలోనూ సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా న్యాయ విద్య కూడా అప్‌డేట్ కావాలని, అప్పుడే కొత్త తరం సైబర్ నేరాలకు చట్టపరంగా అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని జస్టిస్ అలోక్ అరాధే సూచించారు.