Eco Ganesha: ఏటా వినాయక చవితి సంబరాలు ముగిసిన వెంటనే నదులు, సముద్ర తీరాల్లో నీటిలో కరగకుండా ఉండిపోతున్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలు పర్యావరణానికి పెను సవాలుగా మారుతున్నాయి. ఈ పర్యావరణ ముప్పును ఒక అద్భుతమైన సామాజిక విప్లవంగా మలిచారు పర్యావరణ ప్రేమికుడు మల్హర్ కలాంబే, ‘ఇండియాస్ రీసైకిల్ మ్యాన్’గా పేరుగాంచిన డాక్టర్ బినిష్ దేశాయ్. ఈ ఇద్దరు యోధుల వినూత్న ఆలోచన.. ఇప్పుడు వేలాది నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
వ్యర్థాల నుంచి 12 రకాల అద్భుత ఉత్పత్తులను సృష్టిస్తున్నారు. నిమజ్జనం తర్వాత తీరాలకు కొట్టుకువచ్చే పీఓపీ గణనాథుల విగ్రహాలు వృథా కాకుండా, పర్యావరణానికి హాని చేయకుండా మల్హర్, బినిష్ బృందం ప్రత్యేకంగా సేకరిస్తోంది. ఇప్పటివరకు 3,000 కిలోలకు పైగా పీఓపీ వ్యర్థాలను రీసైక్లింగ్ ప్రక్రియకు తరలించి, దానిద్వారా పూల కుండీలు, టేబుల్ లాంప్లు, పెన్ స్టాండ్లతో పాటు సుమారు 12 రకాల ఉపయోగకర ఉత్పత్తులను రూపొందించారు.
760 స్టడీ టేబుళ్లు.. నిరుపేదల చదువుకు ఆసరా!
ఈ వినూత్న ప్రయత్నంలో అత్యంత మరుపురాని ఘట్టం నిరుపేద పిల్లలకు రీసైకిల్ చేసిన స్టడీ టేబుళ్లను అందించడం. సరిగ్గా కూర్చొని చదువుకోవడానికి బల్లలు లేని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం ఇప్పటివరకు 760కి పైగా పటిష్టమైన స్టడీ టేబుళ్లను తయారు చేసి ఉచితంగా అందజేశారు. ఒకప్పుడు పూజలందుకుని నిమజ్జనమైన విగ్రహాలే.. ఇప్పుడు చిన్నారుల పుస్తకాలను మోస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. అంతేకాదు మహారాష్ట్రలోని ప్రభుత్వ బడులకు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందిస్తున్నారు.
ప్రతి టేబుల్‌పై రూ.100 స్కాలర్షిప్ నిధి!
వ్యాపారాన్ని సామాజిక బాధ్యతతో ముడిపెడుతూ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. విక్రయించే ప్రతి గణేశ పీఓపీ స్టడీ టేబుల్ ద్వారా వచ్చే ఆదాయంలో రూ.100 చొప్పున నేరుగా పేద విద్యార్థుల స్కాలర్షిప్ నిధికి కేటాయిస్తున్నారు. ఈ ఆర్థిక తోడ్పాటు ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆసరా లభిస్తోంది. లాభాపేక్షతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక శ్రేయస్సును మిళితం చేస్తూ మల్హర్, బినిష్ చేపట్టిన ఈ అపూర్వ కార్యం ప్రశంసలు అందుకుంటోంది. “ఏదీ వ్యర్థం కాదు” అని నిరూపిస్తూ పర్యావరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఈ ఆలోచన ప్రతి బిజినెస్ రంగానికి గొప్ప మార్గదర్శకంగా నిలుస్తోంది.
