Priya Rajan: సామాజిక మాధ్యమాల్లో నిరంతరం ఎదురవుతున్న విమర్శలు, అనుచిత కామెంట్లపై చెన్నై నగర మేయర్ ప్రియా రాజన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రజాప్రతినిధిగా తన పనితీరును సమీక్షించకుండా, వ్యక్తిగత విషయాలను వివాదాస్పదం చేయడంపై ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి చిన్న అంశాన్ని వివాదంగా మలుస్తున్నారని మండిపడ్డారు. ఆహార అలవాట్లు, కేశాలంకరణ వంటి సాధారణ అంశాలను కూడా కొందరు విమర్శలకు వస్తువుగా మార్చుకుంటున్నారని ఆందోళన చెందారు. ప్రతి నిర్ణయాన్నీ తప్పుబడుతుంటే, కేవలం తానొక మహిళనైనందుకో లేదా ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి చెందినందుకో ఇలా లక్ష్యంగా చేసుకుంటున్నారనే భావన కలుగుతోందన్నారు.
మహిళా సంఘాల తీరుపై అసంతృప్తి!
సామాజిక మాధ్యమాల్లో తనపై అకారణంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా, మహిళా హక్కుల కోసం పోరాడేవారు మౌనంగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయంలో ప్రాతినిధ్యం వహించే మహిళలకు గౌరవం, నైతికతలు ఉండవా అని ప్రశ్నించారు. బాహ్య రూపం, వ్యక్తిగత ఇష్టాయిష్టాల ఆధారంగా ప్రజా జీవితంలోని మహిళల విలువను అంచనా వేయడం సరికాదని స్పష్టం చేశారు. ఏ పదవిలో ఉన్నా ప్రతి మహిళకూ స్వేచ్ఛగా జీవించే హక్కు, సొంత ఆత్మగౌరవం ఉంటాయని ప్రియా రాజన్ పేర్కొన్నారు. హోదాలకు అతీతంగా సమాజంలో ప్రతి మహిళ పట్ల మర్యాదతో ప్రవర్తించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
