BSNL Insurance: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (BSNL) తమ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ తెలిపింది. మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా రూ.లక్ష వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తో పాటు రూ.10,000 వరకు సైబర్ ఫ్రాడ్ రక్షణ కల్పించేలా ప్రత్యేక బంపర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో బీఎస్ఎన్ఎల్ కీలక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
సంస్థ అవతరణ దినోత్సవం సందర్భంగా రెండు ప్రత్యేక ప్రీపెయిడ్ స్పెషల్ టారిఫ్ వోచర్ (STV) ప్లాన్లపై ఈ ఉచిత బీమా ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చింది. స్వల్పకాలిక వినియోగదారుల కోసం STV 202 ప్లాన్‌ను రూపొందించింది. 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో 300 నిమిషాల కాల్స్, 5GB డేటా, 100 SMSలతో పాటు ఉచిత ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇక ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండేందుకు STV 2449 పేరుతో వార్షిక ప్లాన్ తెచ్చింది. 365 రోజుల చెల్లుబాటుతో వచ్చే ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా, 100 SMSల ప్రయోజనాలు అందుతాయి.
ఈ రెండు ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న 24 గంటల్లో ఎలాంటి అదనపు ప్రీమియం లేదా రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే బీమా కవరేజ్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే నామినీకి రూ.లక్ష ప్రమాద బీమా సొమ్ము వర్తిస్తుంది. దాంతో పాటు ఆన్‌లైన్ లేదా బ్యాంకింగ్ సైబర్ మోసాల వల్ల జరిగే నష్టాలకు రూ.10,000 వరకు పరిహార రక్షణ లభిస్తుంది. ప్రైవేట్ టెలికాం సంస్థలు ధరలు పెంచుతున్న తరుణంలో, రీఛార్జ్‌కే ఉచిత బీమా అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ నిర్ణయం పట్ల వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
