Temple Attack: హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్ బస్ డిపో సమీపంలో ఉన్న ప్రసిద్ధ సంతోషిమాత ఆలయంలో శుక్రవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. ఆలయంలోకి ఆకస్మికంగా ప్రవేశించిన ఓ వ్యక్తి అక్కడి పూజారిపై భౌతిక దాడికి ప్రయత్నించడమే కాకుండా, చేతిలో ఉన్న కర్రతో అమ్మవారి విగ్రహంపై దాడికి ఒడిగట్టాడు. ఈ ఊహించని ఘటనతో గుడిలో ఉన్న భక్తులు, ఆలయ సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో నిందితుడు చేతిలో కర్రతో ఆలయ ప్రాంగణంలోకి వచ్చాడు. పూజారిపై దాడికి యత్నిస్తూ అమ్మవారి విగ్రహాన్ని కర్రతో కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలను గమనించిన భక్తులు వెంటనే సమయస్ఫూర్తితో స్పందించి అతడిని అడ్డుకున్నారు. అనంతరం అతడిని పట్టుకుని చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించి వివరాలు సేకరించారు. దాడి దృశ్యాలన్నీ ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు ఆలయంలోకి ఎలా వచ్చాడు, ఈ చర్య వెనుక గల కారణాలేమిటనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆలయ వద్ద పరిస్థితి ప్రశాంతంగా ప్రశాంతంగా ఉందోనని పోలీసులు వెల్లడించారు.
