Organic Food: ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఆర్గానిక్’ జపమే చేస్తున్నారు. మార్కెట్లో సాధారణ కూరగాయలు, ధాన్యాల కంటే ధర రెట్టింపు అయినప్పటికీ, చాలా మంది ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. రసాయనాలు, పురుగుమందులు లేని ఆహారం తినడం వల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతో మేలనేది సగటు వినియోగదారుడి నమ్మకం. అయితే ఈ నమ్మకంలో ఎంతవరకు నిజముంది? సేంద్రీయ సాగు నిజంగానే భూగోళాన్ని కాపాడుతుందా అంటే.. పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్గానిక్ సాగు వల్ల రసాయనాల బారిన పడకుండా నేల, నీరు, స్థానిక వాతావరణం రక్షణ పొందుతాయనేది వాస్తవమే. పురుగుమందుల వాడకం తగ్గడం వల్ల తేనెటీగలు, చిన్న చిన్న క్రిమిటకీటకాలు, నీటి జీవులకు మేలు జరుగుతుంది. అయితే నాణేనికి మరోవైపు చూస్తే, ఆర్గానిక్ పద్ధతుల్లో దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. సాధారణ వ్యవసాయంతో పోలిస్తే అదే పరిమాణంలో ఆహారోత్పత్తి సాధించడానికి ఆర్గానిక్ సాగుకు ఏకంగా 64 శాతం అదనపు భూమి అవసరమవుతుంది. అంటే దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ సాగునే పూర్తిస్థాయిలో అవలంబిస్తే, ఆహార అవసరాల కోసం అడవులను నరికివేసి వ్యవసాయ భూములుగా మార్చాల్సి వస్తుంది. ఇది పర్యావరణ సమతుల్యతకే తీవ్ర ప్రమాదకరం.
మరోవైపు గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు, భూమి ఆమ్లత్వంలో మార్పులు, నీటి కాలుష్యం వంటి విషయాల్లో సాధారణ వ్యవసాయానికి, ఆర్గానిక్ సాగుకు పెద్దగా తేడా లేదని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్గానిక్ సాగులో ఉపయోగించే సహజ ఎరువులు (సహజ నిరూపిత ఎరువులు) కూడా నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తాయి.
అసలైన నిజమేమిటంటే.. పర్యావరణ పరిరక్షణ అనేది ఆహారాన్ని ‘ఎలా పండించారు’ అనే దానికంటే, మనం ‘ఏం తింటున్నాం’ అనే దానిపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక కిలో మాంసం (బీఫ్) ఉత్పత్తి చేయడానికి వాతావరణంలోకి దాదాపు 100 కిలోల గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. అదే ఒక కిలో బఠాణీలు లేదా కూరగాయల ఉత్పత్తి వల్ల ఒక కిలో కంటే తక్కువ ఉద్గారాలే వెలువడతాయి. ఆర్గానిక్ పద్ధతిలో మాంసాన్ని ఉత్పత్తి చేసినా పర్యావరణానికి జరిగే నష్టం తగ్గదు.
కాబట్టి కేవలం ఆర్గానిక్ ముద్ర ఉన్న ఉత్పత్తుల కోసం ఎక్కువ డబ్బులు తగలేయడం కంటే, జంతు ఆధారిత ఆహారాన్ని తగ్గించి మొక్కల ఆధారిత ఆహారానికి (శాకాహారం) ప్రాధాన్యత ఇవ్వడమే పర్యావరణానికి, ఆరోగ్యానికి అసలైన మేలు చేస్తుంది. ఆర్గానిక్ పేరుతో జరుగుతున్న ప్రచారంలో ఉన్న భ్రమలను వీడి, సమతుల్య ఆహారాన్ని ఎంచుకోవడమే వివేచనతో కూడిన మార్గం.
