బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా
మీర్జా ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్!
255 ఓట్లతో బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా ఎన్నిక
నేటి సాయంత్రం బంగభవన్‌లో ప్రమాణ స్వీకారం
మినిట్ 2 మినిట్, అంతర్జాతీయ విభాగం (ఆగస్ట్ 21): పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న చారిత్రాత్మక రాజకీయ పరిణామాల్లో భాగంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) సీనియర్ నాయకుడు మీర్జా ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ ఆ దేశ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జాతీయ పార్లమెంట్ భవన్లో జరిగిన ఈ ఎన్నికల్లో మిర్జా ఫక్రుల్కు 255 ఓట్లు లభించగా, ప్రతిపక్ష కూటమి అభ్యర్థి కల్నల్ (రిటైర్డ్) ఒలీ అహ్మద్‌కు 88 ఓట్లు వచ్చాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎంఎం నసీర్ ఉద్దీన్ వెల్లడించారు.
మొత్తం 349 మంది పార్లమెంట్ సభ్యులకు గాను 343 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిఎన్‌పిలో సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా కీలక పాత్ర పోషించిన అలంగీర్ శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు ‘బంగభవన్’లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యాక్టింగ్ స్పీకర్ కైసర్ కమాల్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
