వారి కుక్కలకున్న సౌకర్యాలు కూడా మన బడుల్లో లేవు
‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే
మినిట్ 2 మినిట్, ప్రత్యేక ప్రతినిధి (ఆగస్ట్ 21): భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారాయని కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) అధినేత అభిజీత్ దీప్కే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ పెంపుడు జంతువుల కోసం కల్పించే లగ్జరీ సౌకర్యాలు కూడా పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో లేకపోవడం దేశానికే సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
సీజీపీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ ఆందోళన కార్యక్రమంలో భాగంగా లతూర్ జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షానికి కురుస్తున్న రేకుల కప్పులు, డ్రైనేజీ లేని అపరిశుభ్ర వాతావరణం, పాములకు నిలయంగా మారిన బడి ఆవరణను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలిక వసతులు లేక పాము కాటుకు గురై అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే విద్యాశాఖ యంత్రాంగం నిద్రపోతోందా అని ప్రశ్నించారు. ధర్మం ప్రమాదంలో ఉందంటూ రాజకీయాలు చేసే నాయకులు.. కనీస మరుగుదొడ్లు, తాగునీరు లేక పిల్లల భవిష్యత్తు నిజంగా ప్రమాదంలో పడుతోందనే సత్యాన్ని గుర్తించాలని హితవు పలికారు.
పాఠశాలల విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, పాఠశాలలు బాగుపడే వరకు రాజకీయ నాయకులను గ్రామాల్లోకి రానివ్వకూడదని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో యువత (జెన్ జీ) ప్రశ్నించే శక్తి ఉద్యమంగా మారి విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తుందని హెచ్చరించారు.
