చిన్నారి అకాల మరణంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సమాజం
భయాందోళనతో క్లాస్‌రూమ్‌లోనే ప్రాణాలు విడిచిన ఆరేళ్ల బాలుడు
ఉపాధ్యాయుల తీరు, విద్యార్థుల మనస్తత్వాలపై విస్తృత చర్చ
క్రమశిక్షణ కోసం మందలించక తప్పని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు
ఇంకోవైపు దారితప్పి ఏకంగా గురువులనే హత్య చేస్తున్న విద్యార్థులు
తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు ఘటనలు.. సమాజాన్ని వేధిస్తున్న ప్రశ్నలు
మినిట్ 2 మినిట్, ట్రెండింగ్ టాపిక్(ఆగస్ట్ 21): విశాఖపట్నం వన్‌టౌన్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న ఆరేళ్ల చిన్నారి ప్రణయ్ తేజ్ తరగతి గదిలోనే కుప్పకూలి మరణించిన సంఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది. హోమ్‌వర్క్ సరిగా చేయలేదనే కారణంతో ఉపాధ్యాయురాలు గద్దించడంతో సదరు చిన్నారి తీవ్ర భయాందోళనకు లోనై గుండెపోటుతో కన్నుమూయడం సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు గద్దించినందుకే చిట్టి గుండె ఆగిపోయిన పసిపిల్లల సున్నితత్వం.. మరోవైపు పాఠశాల ప్రిన్సిపాల్‌నే హత్య చేసిన విద్యార్థుల ఘటన మరోవైపు.. ఈ రెండింటి మధ్య నేటి విద్యావ్యవస్థ, ఉపాధ్యాయుల పరిస్థితి కత్తిమీద సాములా మారింది. పిల్లలను కంట్రోల్ చేయకపోతే క్రమశిక్షణ తప్పిపోతారనే ఆందోళన ఒకవైపు, గద్దిస్తే ఏ క్షణంలో ఎలాంటి అపశృతి జరుగుతుందోననే భయం మరొకవైపు టీచర్లను వెంటాడుతోంది.
అయితే, ఈ అత్యంత విషాదకర సమయంలో ఆ బాలుడి కుటుంబం, ముఖ్యంగా ప్రణయ్ తేజ్ అమ్మమ్మ చూపిన పరిణతి సమాజానికి ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది. ఇది ఎవరినో నిందించాల్సిన సమయం కాదని, “శివాజ్ఞ”గా భావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాధిత కుటుంబ సంస్కారానికి అద్దం పట్టాయి. ఈ ఘటన ఎవరినో నేరస్థులుగా నిలబెట్టడం కంటే, నేటి విద్యాబోధనలో మార్పుల ఆవశ్యకతను చాటిచెబుతోందని సైకాలజిస్టులు అంటున్నారు.
పసిపిల్లల మనస్సులు అత్యంత సున్నితమైనవని, చిన్ననాటి నుంచే పిల్లలపై చదువు, హోమ్‌వర్క్ ఒత్తిడి పెంచకుండా ఆప్యాయత, సహనంతో కూడిన వాతావరణంలో బోధన సాగాలి అంటున్నారు. అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పిల్లల మానసిక దృఢత్వాన్ని, ఆరోగ్య స్థితిని గమనిస్తూ పెంచాల్సిన బాధ్యత నేడు ఎంతైనా ఉందని చెబుతున్నారు. భయం స్థానంలో ప్రేమను, ఒత్తిడి స్థానంలో ప్రోత్సాహాన్ని నింపినప్పుడే ఇలాంటి హృదయవిదారక ఘటనలకు అడ్డుకట్ట వేయగలమని సైకాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఒత్తిళ్లను తట్టుకుని మానసికంగా ఎలా దృఢంగా ఉండాలో నేర్పించాలంటున్నారు. పాఠశాలల్లో క్రమం తప్పకుండా పేరెంట్-టీచర్ మీటింగ్స్ (PTM) నిర్వహిస్తూ, పిల్లల ప్రవర్తన, ఆరోగ్యం, అలవాట్లపై తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు సమన్వయంతో దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
