అక్రమాస్తులు రూ.100 కోట్లకు పైనే!
ఇబ్రహీంపట్నం ఏవో ఇండ్లలో ఏసీబీ తనిఖీలు!
ఏకకాలంలో 15 చోట్ల సోదాలు
గతంలో మహేశ్వరం తహసీల్దార్‌గా పనిచేసిన ఏవో శ్రీనివాస్ రెడ్డి
మినిట్ 2 మినిట్, ఇబ్రహీంపట్నం (ఆగస్ట్ 21): అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ దడ పుట్టించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవోగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, నివాసాలు సంబంధిత కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
గతంలో మహేశ్వరం తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ రెడ్డి, తన అధికార పరిధిని ఉపయోగించి పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు గడించారనే ఫిర్యాదులు రావడంతో ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. తెలంగాణవ్యాప్తంగా ఆయనకు, ఆయన బంధువులకు చెందిన సుమారు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు స్థిరాస్తుల పత్రాలు, బ్యాంక్ లాకర్లు, నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. శ్రీనివాసరెడ్డి ఇంట్లో కిలోకు పైగా బంగారం, 8 ఖాళీ స్థలాలు, యాచారంలో 10 ఎకరాల భూమి, హస్తినాపురంలో మూడంతస్తుల భవనం, ఓ బార్ లో కుమారుడి పేరిట రూ.86 లక్షల పెట్టుబడి, 7 బ్యాంకు ఖాతాల్లో రూ.8 లక్షలు, ఇంట్లో రూ.4 లక్షలు, 3 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో శ్రీనివాసరెడ్డి మహేశ్వరం తహసీల్దార్ గా విధులు నిర్వహించారు.
