LB NAGAR: ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రత్యర్థులు అక్కర్లేదు.!

ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌ను
ఓడించడానికి ప్రత్యర్థులు అక్కర్లేదు.!

సొంత పార్టీ నేతల తీరుతో కకావికలమవుతున్న వైనం
రాష్ట్రంలో పవర్‌లో ఉన్నా సర్వం కోల్పోతున్న హస్తం పార్టీ
లీడర్ల ఆధిపత్య పోరుతో ప్రత్యర్థి గెలుపునకు రాచబాటలు
జక్కిడి వర్సెస్ మధు యాష్కీ మధ్య ముదిరిన విభేదాలు
ఆడియో లీకులతో అయోమయంలో కాంగ్రెస్ శ్రేణులు

మినిట్ 2 మినిట్, ఎల్బీనగర్ (ఆగస్ట్ 21): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాత్రం సొంత నేతల ఆధిపత్య పోరు, వర్గపోరు పార్టీని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రత్యర్థులు ఎవరూ శ్రమించాల్సిన అవసరం లేదని, నేతల అంతర్గత కుమ్ములాటలే ప్రత్యర్థి విజాయానికి పరోక్షంగా బాటలు వేస్తున్నాయని క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత శాసనసభ ఎన్నికల్లో సీనియర్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఓడిపోయినా.. ‘స్థానికేతరుడు’ అనే ముద్రతో పాటు, నియోజకవర్గంలో అగ్రవర్ణాల డామినేషన్‌ను తట్టుకుని తన ఉనికిని చాటుకునేందుకు మధు యాష్కీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే గత నాలుగు దశాబ్దాలుగా ఎల్బీనగర్‌లో బలమైన వర్గంగా ఉన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సాగుతున్న రాజకీయాలు ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జక్కిడి ప్రభాకర్ రెడ్డి తనయుడు శివచరణ్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా జక్కిడి ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుని బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నారని ప్రతిబింబించేలా పలు ఆడియోలు, వీడియోలు వైరల్ కావడం కలకలం రేపుతోంది. ఒకసారి యాదవులను, మరోసారి ఎరుకల సామాజిక వర్గాన్ని కించపరిచినట్లుగా ఉన్న వాయిస్ క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ హైకమాండ్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. బీసీ వర్గానికి చెందిన మధుయాష్కీ తన ప్రాబల్యాన్ని ప్రదర్శించేందుకే ఈ లీకుల వెనుక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లోనే జరుగుతోంది. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు రచ్చకెక్కాయి.

సొంత పార్టీ నాయకుల మధ్య సాగుతున్న ఈ తీవ్రమైన దుష్ప్రచారం, కుల సమీకరణల వివాదాలు చివరకు ప్రత్యర్థులకు బలమైన ఆయుధాలుగా మారుతున్నాయి. బీసీ సామాజిక వర్గాల ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో విఫలమవుతూ, సొంత నేతలను నిర్వీర్యం చేసుకుంటున్న ఎల్బీనగర్ కాంగ్రెస్ తీరు చూస్తుంటే.. భవిష్యత్తులోనూ ఇక్కడ కోలుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.