LB Nagar potholes: ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమైందా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా మారింది ఇక్కడి మౌలిక వసతుల పరిస్థితి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే కామినేని హాస్పిటల్ ఎదురుగా, ఫ్లైఓవర్ పక్క రోడ్డుపై ఏర్పడిన భయంకరమైన గుంతలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. రహదారులు సరిగా లేక వాహనదారులు, బాటసారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
బైక్ మీద వెళ్లేవాళ్లు తమ రక్షణ కోసం హెల్మెట్ పెట్టుకోవడం సాధారణం. కానీ ఇక్కడ విచిత్రంగా రోడ్డుపై ఉన్న గుంతకే హెల్మెట్ తగిలించి, కుండలు పెట్టాల్సిన దుస్థితి దాపురించింది. ప్రధాన రహదారిపై ఉన్న ఈ గుంత కారణంగా రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతాయని గమనించిన స్థానికులు తాత్కాలిక సూచికగా కుండను, హెల్మెట్‌ను పెట్టారు. ప్రజలే స్వయంగా ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేసుకోవడం అధికార యంత్రాంగం అలసత్వానికి అద్దం పడుతోంది.
స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ల పాలనలో జరిగింది ఏంటని నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు. ఫ్లైఓవర్ల హడావుడి తప్ప, కనీసం వాహనాలు నడిచే రోడ్లను బాగు చేయకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఏ క్షణంలో ఏ వాహనదారుడు ఈ గుంతలో పడి ప్రాణాలు కోల్పోతాడోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు నిద్రమత్తు వీడి తక్షణమే స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
