School Bus మీర్‌పేట్‌లోని జిల్లెలగూడ, స్వాగత్ గ్రాండ్ హోటల్ ఎదురుగా పల్లవి మోడల్ స్కూల్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. సోమవారం సాయంత్రం సమయంలో వేగంగా వెళ్తున్న బస్సు ఉన్నట్లుండి అదుపు తప్పి డివైడర్‌ను ఎక్కి అక్కడే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ పాఠశాల బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య యాజమాన్యంలో నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పల్లవి స్కూల్‌కు చెందిన బస్సులు నిత్యం రోడ్లపై తిరుగుతుంటాయి. అయితే, పాఠశాల బస్సుల పర్యవేక్షణ, రవాణా భద్రతా ప్రమాణాలపై స్థానికంగా రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సుల కండిషన్, డ్రైవర్ల ప్రవర్తనపై యాజమాన్యం సరైన నిఘా పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
గతంలో కూడా ఇదే స్కూల్‌కు చెందిన ఓ బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. సరైన భద్రతా నిబంధనలు పాటించకపోతే భవిష్యత్తులో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి బస్సుల కండిషన్‌ను నిరంతరం తనిఖీ చేయాలని, విద్యార్థుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.
