Food Safety: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార విక్రయ కేంద్రాలు, హాస్టళ్ల నిర్వాహకులపై హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి కొరడా ఝుళిపించారు. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) లేడీస్ హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఓయూ హాస్టల్‌తో పాటు నగరంలోని పలు ప్రైవేట్ హాస్టళ్లు, రెస్టారెంట్లలో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
విస్తుపోయే ఉల్లంఘనలు బహిర్గతం
ఈ తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి. పలు రెస్టారెంట్లు, హాస్టళ్ల వంట గదులు అత్యంత అపరిశుభ్రంగా ఉండటంతో పాటు బొద్దింకలు, ఇతర కీటకాలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కుళ్లిపోయిన కూరగాయలు, గడువు ముగిసిన సాస్‌లు, వెనిగర్‌ను వంటల్లో వాడుతున్నట్లు తేలింది. అంతేకాకుండా, కనీస లేబుళ్లు లేకుండా చపాతీ ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు బయటపడింది. ఆహార భద్రతా ప్రమాణాలను గాలికొదిలేసిన కొన్ని సంస్థలను తక్షణమే మూసివేయనుండగా, మరికొన్నింటికి షోకాజ్, ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
