hyderabad: హైదరాబాద్ మెట్రోకు అదనపు బోగీలు !

హైదరాబాద్ మెట్రోకు అదనపు బోగీలు.
పాతబస్తీ లైన్ పనుల్లో వేగం పెంచండి
మెట్రో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి

మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (ఆగస్టు 12): హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్లకు అదనపు బోగీలను జత చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన కొత్త మెట్రో రైల్ కోచ్‌లను కొనుగోలు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మెట్రో రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై అధికారులతో ఆరా తీశారు. ముఖ్యంగా పాతబస్తీ మెట్రో లైన్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మరోవైపు, డిసెంబర్‌లో నిర్వహించనున్న “ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లపైనా సీఎం సమీక్షించారు. వ్యాపార రంగంలో విశేష గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్‌లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు పూర్తి చేసి, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా చూడాలని అధికారులకు సూచించారు.