Sports Quota: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా డీఎస్సీ ఉద్యోగాలపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య విమర్శలు పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం సాధించిన శ్రీకాకుళం జిల్లా క్రీడాకారుడు పెద్ద అప్పలరాజును లక్ష్యంగా చేసుకుని వైసీపీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అసలు అతనికి అర్హతే లేదని, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందాడని సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారం ఒక క్రీడాకారుడి మనోధైర్యాన్ని దెబ్బతీశాయి. అర్హత ఉన్న వ్యక్తిని ఫేక్ అని ప్రచారం చేయడం ఏ రకమైన రాజకీయమో అర్థం కావడం లేదని తాజాగా ఆయన ఓ వేదికపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా ఈ బురద జల్లుడు?
క్రీడల్లో ఒక స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఏళ్ల శ్రమ, కష్టం, త్యాగాలు దాగి ఉంటాయి. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని, పతకాల కోసం రింగ్‌లో పోరాడిన అనుభవం ఉన్న అప్పలరాజును రాజకీయ ప్రయోజనాల కోసం టార్గెట్ చేయడం దారుణమన్న చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీల నిర్ణయాలను, ప్రభుత్వ నియామకాలను తప్పుపట్టే క్రమంలో, ఏ సంబంధం లేని సాధారణ క్రీడాకారుడిపై నకిలీ ముద్ర వేయడం బాధ్యతారాహిత్య రాజకీయాలకు అద్దం పడుతోంది. అధికార పక్షాన్ని విమర్శించాలనుకుంటే విధానాలపై మాట్లాడాలి తప్ప, కష్టపడి ఉద్యోగం సాధించిన అర్హులైన యువత జీవితాలతో ఆడుకోవడం ఏమాత్రం తగదు.
నిజానిజాలు విస్మరించి పదే పదే దుష్ప్రచారం
తన సొంత తమ్ముడి సర్టిఫికెట్లతో ఉద్యోగం సాధించాడంటూ వైసీపీ సాగించిన దుష్ప్రచారాన్ని అప్పలరాజు వేదికపైకి వచ్చి తీవ్రంగా ఖండించారు. చిన్నప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లా స్థాయిలో తన బాక్సింగ్ నైపుణ్యం అందరికీ తెలుసని, నేషనల్ లెవెల్‌లో పోరాడి సాధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లనే ప్రభుత్వానికి సమర్పించానని స్పష్టం చేశారు. తన ఆటకు సంబంధించిన వీడియో ఆధారాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికీ, నిజానిజాలతో పనిలేకుండా పదే పదే ఫేక్ అంటూ ప్రచారం చేయడం వెనుక ఉన్న కుట్రను ఆయన ఎండగట్టారు. ఒక క్రీడాకారుడు తన ప్రామాణికతను నిరూపించుకోవడానికి రింగ్ వదిలి మైకు పట్టుకుని ఆవేదన వ్యక్తం చేయాల్సి రావడం నిజంగా విషాదకరం.
క్రీడలను, క్రీడాకారులను గౌరవించాల్సిన బాధ్యత లేదా?
ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ విమర్శలు వాస్తవాల ప్రాతిపదికన ఉండాలి. కేవలం బురదజల్లి పబ్బం గడుపుకునే చీప్ పాలిటిక్స్ వల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలిపోతుంది. వైసీపీ నాయకులు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ఒక క్రీడాకారుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం పట్ల క్రీడాభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి, క్రీడాకారుల శ్రమాన్ని, వారి కష్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
