వయసు 15 ఏళ్లే.. కానీ ఆట మాత్రం ఊహకందని అద్భుతం.. వైభవ్ సూర్యవంశీపై జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: క్రికెట్ ప్రపంచంలో రికార్డులను తిరగరాస్తూ, తనదైన శైలిలో దూసుకుపోతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ యువ కెరటం గురించి జురెల్ మాట్లాడిన తీరు క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అనూహ్య ఆటతీరు.. వావ్ అనాల్సిందే

రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తరఫున ఐపీఎల్‌లో ఒకే డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకుంటున్న ఈ ఇద్దరు యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇటీవల ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో ధ్రువ్ జురెల్ మాట్లాడుతూ వైభవ్ బ్యాటింగ్ శైలిని ఆకాశానికి ఎత్తారు. పదేళ్ల వయసులో పిల్లలు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడమే గొప్ప అనుకునే ఈ రోజుల్లో, 15 ఏళ్ల ప్రాయంలో అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సైతం అతను ఎదుర్కొంటున్న తీరు నమ్మశక్యంగా లేదని కొనియాడారు. వైభవ్ క్రీజులోకి వచ్చి బౌండరీల వర్షం కురిపిస్తుంటే చూసేవారికి ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుందని, అందుకే అతని ఆట చూసిన ఎవరైనా సరే వావ్ అనకుండా ఉండలేరని అభిప్రాయపడ్డారు.

అసూయకు తావు లేదు.. ప్రశంసలే అర్హత

సమకాలీన క్రికెటర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండటం సహజం. అయితే వైభవ్ ప్రతిభ విషయంలో తనకు ఎలాంటి అసూయ గానీ, పోలికలు గానీ లేవని జురెల్ స్పష్టం చేయడం విశేషం. “మనం కూడా ఆ స్థాయిలో ఆడగలమనే ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే పోలికలు వస్తాయి. కానీ వైభవ్ చేసే విన్సెంట్లు మనం కనీసం కలలో కూడా ఊహించలేం. అతని టాలెంట్ అంతకంటే ఎంతో ఉన్నతంగా ఉంది” అని జురెల్ నిజాయితీగా అంగీకరించారు. ఒక సహచర ఆటగాడిగా తోటి యువ క్రికెటర్ ఎదుగుదలను ఎంతగానో అభినందిస్తూ, ఆ ప్రశంసలకు వైభవ్ పూర్తిగా అర్హుడని ఆయన మరోసారి గుర్తుచేశారు.

టీమిండియాలో మెరుపులు.. చరిత్ర సృష్టిస్తున్న వైభవ్

అతి చిన్న వయసులోనే సంచలన విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న వైభవ్ సూర్యవంశీ కెరీర్ ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. ఇండియా అండర్-19 జట్టు తరఫున సత్తా చాటిన అతను, ఐపీఎల్ మెగా టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత సీనియర్ టీమిండియాలోకి అడుగుపెట్టి, జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేయడమే కాకుండా ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

సహచరులకూ స్ఫూర్తిదాయకం

కేవలం వ్యక్తిగత రికార్డులే కాకుండా, వైభవ్ క్రీజులో ప్రదర్శించే పవర్‌ప్లే దూకుడు జట్టులోని మిగతా బ్యాటర్లలోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోందని జురెల్ వెల్లడించారు. పవర్‌ప్లే ఓవర్లలో వైభవ్ బౌలర్లపై ఎదురుదాడి చేసే విధానం తమకు కూడా బ్యాటింగ్ చేయడానికి మరింత స్ఫూర్తిని ఇస్తుందని, సహచర బ్యాటర్లుగా తమ పనిని ఆ కుర్రాడు ఎంతో సులభతరం చేస్తున్నాడని ప్రశంసించారు. రానున్న రోజుల్లో భారత క్రికెట్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ ఒక బలమైన ఆస్తిగా మారుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.