Ramya Rao: తాతల కాలం నాటి వందల ఎకరాల భూములు తమకు ఉన్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెప్తున్న మాటలపై సొంత కుటుంబ సభ్యులే తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. గాంధీభవన్ వేదికగా కేసీఆర్ సొంత అన్న కుమార్తె, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రమ్యారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాను రేపుతున్నాయి. నిజంగానే తాతల నాటి వందల ఎకరాల భూమి ఉంటే కేసీఆర్ సొంత అన్న బిడ్డగా తమ కుటుంబానికి రావాల్సిన వాటా ఏదని ఆమె గట్టిగా నిలదీశారు. సొంత ఆస్తి ఉంటే తమకు రాకుండా బినామీల ఖాతాల్లోకి ఎలా పోయిందో చెప్పాలంటూ ఘాటుగా ప్రశ్నించారు.
సంతోష్ రావు వేల కోట్ల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?
కేసీఆర్ కుటుంబంతో ఎలాంటి ప్రత్యక్ష రక్తం సంబంధం లేని జోగినపల్లి సంతోష్ రావు చేతుల్లోకి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఏ విధంగా వచ్చాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఒకప్పుడు కరీంనగర్లో ఉన్న సమయంలో కనీసం కాళ్లకు సరిగ్గా చెప్పులు కూడా లేని పరిస్థితి నుంచి, ఈ రోజు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఫైవ్ స్టార్ హోటల్ లాంటి ఇల్లు, ప్రైమ్ ఏరియాలో 9 ఎకరాల స్థలం ఎలా కొనుగోలు చేశారో సమాధానం చెప్పాలని రమ్యారావు డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంతోష్ రావు కుటుంబంలోకి చొరబడి, మిగిలిన వారిని పక్కకు తోసేసి అక్రమంగా వేల కోట్లు కూడబెట్టారని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంతోష్ రావు భార్య రోహిణి పేరుతో నాచారం గూడెంలో ఏకంగా రూ. 21.40 కోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్లు నిర్మించడం, చిన్న షాపూర్లో ఎకరాల కొద్దీ ఫామ్‌హౌస్‌లు నిర్మించడం వెనుక ప్రజల సొమ్ము ఉందనే ఆరోపణలు ఆమె చేశారు. ఇవన్నీ కేవలం బయటపడిన కొన్ని ఉదాహరణలు మాత్రమేనని, దుబాయ్ వేదికగా సాగుతున్న వ్యాపారాలు, సోషల్ మీడియా నెట్వర్క్ వెనుక కూడా బీఆర్ఎస్ అక్రమ సంపాదన ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు.
ప్రజా సంపాదనను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి!
ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తట్టుకోలేకనే బీఆర్ఎస్ నాయకులు ఉనికి కోసం ప్రయతిస్తున్నారని రమ్యారావు విమర్శించారు. కష్టపడి పని చేసే వ్యక్తులను పక్కన పెట్టి, బినామీ వ్యవస్థతో రాష్ట్రాన్ని లూటీ చేసిన వైనంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యమం ముసుగులో దోచుకున్న ఆస్తులన్నిటిపై ఆధారాలు ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి సంతోష్ రావుతో పాటు మిగిలిన వారి అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజలకే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా కేటీఆర్ అబద్ధాల ప్రచారం ఆపి, సొంత కుటుంబ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
