జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేబినెట్ మౌనం.. మూడేళ్లవుతున్నా వీడని సస్పెన్స్!

Journalist Sites

Journalist Sites

Journalist Sites:  ఎన్నికల ముందు జర్నలిస్టుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జర్నలిస్టుల సమస్యలను ఎందుకు పక్కనపెట్టింది? ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. మూడేళ్లు కావస్తున్నా కనీసం కేబినెట్‌లో చర్చించడానికి కూడా ఎందుకు ముందుకు రావడం లేదు? 25కు పైగా మంత్రివర్గ సమావేశాలు జరిగినా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశానికి చోటు దక్కకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనేక అనుమానాలు రేకెత్తిస్తోందని ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ (పీడీఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌బీఎన్ చారి చారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల తరహాలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సంక్షేమాన్ని హామీలకే పరిమితం చేస్తోందని, మాట ఇచ్చి మరిచిపోవడం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా వర్గాలను అవమానించడమేనని ధ్వజమెత్తారు.

ఐదు హామీలు.. అమలేది?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి ఐదు ప్రధాన హామీలను 27వ అంశంగా పొందుపరిచిందని చారి గుర్తుచేశారు. జర్నలిస్టుల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం, అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారీగా ఇళ్ల స్థలాల కేటాయింపు, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం, పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని కూడా ప్రకటించారని తెలిపారు.
అయితే అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఈ హామీల్లో ఎన్ని పూర్తిస్థాయిలో అమలయ్యాయి? ఎన్ని కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందాయి? ఎంతమంది రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్లు అందుతున్నాయి? సంక్షేమ నిధి ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మేనిఫెస్టోలో హామీలు పొందుపరచడం కేవలం ఓట్లు సంపాదించడానికేనా? అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడమేనా? అని నిలదీశారు.
ఇళ్ల స్థలాలపై మౌనమెందుకు?
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులు ఉన్నారని, అనేక మంది తమ జీవితకాల సంపాదనను అద్దె ఇళ్లకే వెచ్చిస్తూ సొంతింటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారని చారి పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన ప్రభుత్వం, కనీసం కేబినెట్ అజెండాలోనూ ఈ అంశాన్ని చేర్చకపోవడం బాధాకరమన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మరో కమిటీనా? మరిన్ని హామీలనా? లేక నిర్దిష్ట గడువుతో అమలు చేసే కార్యాచరణనా? ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
చిన్న పత్రికలపై చిన్నచూపు!
జర్నలిస్టుల సంక్షేమ హామీలను అమలు చేయకపోగా, ఇప్పటికే ఉన్న సౌకర్యాలను సైతం తగ్గించడం మరింత ఆందోళనకరమని చారి విమర్శించారు. చిన్న, మధ్యతరహా పత్రికలు, పీరియాడికల్స్‌కు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయడం, రెండేళ్లుగా ప్రకటనల బకాయిలు చెల్లించకపోవడం వల్ల అనేక మీడియా సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు. పెద్ద పత్రికలకు ప్రాధాన్యం ఇస్తూ చిన్న పత్రికలను విస్మరించడం వల్ల గ్రామీణ, స్థానిక జర్నలిజం తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.
ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చిన్న పత్రికల మనుగడకు సహకరించాల్సిన ప్రభుత్వం, వాటి గొంతు నొక్కే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న ప్రకటనల బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు, అర్హత కలిగిన చిన్న, మధ్యతరహా పత్రికలకు ప్రకటనలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
అక్రిడిటేషన్లలోనూ అన్యాయమే!
రాష్ట్రంలో 44 వేలకు పైగా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, మరోవైపు కేబుల్ ఛానళ్లకు గతంలో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల్లో సగానికి పైగా తగ్గించిందని చారి ఆరోపించారు. ఐపీ నెట్‌వర్క్ పేరుతో అనేక కేబుల్ ఛానళ్లకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయకుండా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. మీడియా సంస్థల వాస్తవ పరిస్థితులను, జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా పారదర్శకమైన విధానం అమలు చేయాలని కోరారు.
హెల్త్ కార్డులు ఉన్నా.. వైద్యం అందేనా?
జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తక్షణమే సమగ్ర హెల్త్ కార్డుల విధానాన్ని అమలు చేయాలని చారి డిమాండ్ చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత హెల్త్ కార్డులు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సక్రమంగా పనిచేయకపోవడంతో జర్నలిస్టులు అత్యవసర వైద్య సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న తరహాలోనే జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం సమాధానం చెప్పాలి!
జర్నలిస్టుల సంక్షేమం అనేది ఎవరో అడిగే వ్యక్తిగత ప్రయోజనం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న మీడియా వర్గాల న్యాయమైన హక్కు అని ఎస్బిఎన్ చారి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం, ఇళ్ల స్థలాల అంశాన్ని కేబినెట్‌లో చర్చించకపోవడం, చిన్న పత్రికలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వానికి తగదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై కేబినెట్‌లో చర్చించి స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని, ఐదు హామీల అమలుకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ విడుదల చేయాలని పిడిఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్బిఎన్ చారి డిమాండ్ చేశారు.