Maths Teacher: ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తలచుకుంటే విద్యార్థుల తలరాతలనే కాదు, వారి కలలకు రెక్కలు తొడిగి ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లగలరని నిరూపించిన ఘటన ఇది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న నరేందర్ రెడ్డి తన విద్యార్థుల్లో చదువు పట్ల పట్టుదలను నింపేందుకు వినూత్నంగా ఆలోచించారు. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో 550 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయిస్తానని విద్యా సంవత్సరం ప్రారంభంలో మాట ఇచ్చారు.
ఆ ఉపాధ్యాయుడి మాటలు విద్యార్థుల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నిరంతరం శ్రమించి పదో తరగతి ఫలితాల్లో మహేష్, పవన్ అనే ఇద్దరు విద్యార్థులు 550 పైగా మార్కులు సాధించి మెరిసారు. విద్యార్థులు చూపిన ప్రతిభకు మురిసిపోయిన నరేందర్ రెడ్డి, తాను ఇచ్చిన మాట ప్రకారం శనివారం ఆ ఇద్దరినీ విమానంలో తిరుపతికి తీసుకెళ్లారు.
జీవితంలో ఊహించని విమాన ప్రయాణాన్ని ప్రశాంతంగా ఆస్వాదించిన విద్యార్థుల ఆనందానికి అవధులు లేవు. మేఘాల మధ్య పయనిస్తూ తమ కుటుంబాల నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగినట్లు భావించామని ఆ విద్యార్థులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ జీవితాల్లో మరచిపోలేని ఈ మధురజ్ఞాపకాన్ని అందించిన గురువు నరేందర్ రెడ్డికి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే అదే గురువులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు కలలకు అడ్డంకి కాకూడదని, సరైన ప్రోత్సాహం అందిస్తే గ్రామీణ విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. చిన్నపాటి ప్రోత్సాహం పిల్లల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని వెల్లడించారు. మాట నిలబెట్టుకుని విద్యార్థుల కలలను నిజం చేసిన ఆ గురువు ఉదారతను గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది, ఇతర ఉపాధ్యాయులు వేనోళ్ల కొనియాడారు.
