మినిట్2మినిట్ డెస్క్, మీర్పేట్: వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సాదాసీదా కిడ్నీ రాళ్ల సమస్యతో ఆస్పత్రిలో చేరిన యువకుడు కన్నవాళ్లకు దూరమయ్యాడు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం వెల్నెస్ హాస్పిటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం… మహేష్ (34) అనే యువకుడు కిడ్నీలో రాళ్ల సమస్యతో చికిత్స నిమిత్తం హస్తినాపురంలోని వెల్నెస్ హాస్పిటల్లో చేరాడు. అయితే, వైద్యుల నిర్లక్ష్యం, అనుభవరాహిత్యం వల్లే మహేష్ మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, మహేష్ చనిపోయిన విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం తక్షణమే తెలపకుండా, కొన్ని గంటల పాటు గోప్యంగా ఉంచిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్పత్రిపై దాడి.. రోడ్డుపై ధర్నా
బాధితుడి మరణవార్త వినగానే బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యానికి నిరసనగా ఆస్పత్రి ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో రగిలిపోయిన బాధితుడి బంధువులు ఆస్పత్రిలోని అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం హస్తినాపురం ప్రధాన రహదారిపై మహేష్ మృతదేహంతో ధర్నాకు దిగారు. బాధ్యులైన వైద్యులపై తక్షణమే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో ప్రధాన రహదారిపై కాసేపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.
రంగంలోకి దిగిన పోలీసులు
ఘటన గురించి సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బంధువులతో మాట్లాడి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మహేష్ మృతికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వైద్యుల వైఫల్యం లేదా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
